కోల్‌కతా, డిసెంబర్ 9:భారత్, బంగ్లాదేశ్ సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. బెంగాల్, బీహార్, ఒడిశా రాష్ర్టాలు ఒకప్పుడు తమవేనన్న వాదనను బంగ్లాదేశ్ ప్రధాన ప్రతిపక్షం బీఎన్పీ తెరపైకి తీసుకొచ్చింది. బెంగాల్‌ను కొద్ది రోజుల్లోనే ఆక్రమించుకోచ్చని బంగ్లాదేశ్ ఆర్మీ వెటరన్స్ ప్రసంగించిన వీడియో ఒకటి కూడా వైరల్ అయ్యింది. బుధవారం (డిసెంబర్ 4న) ఢాకాలో నిర్వహించిన సమావేశానికి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ హాజరయ్యాయి.
బీఎన్పీ ప్రధాన కార్యదర్శి రుహుల్ కబీర్ రిజ్వీ మాట్లాడుతూ, ‘బంగ్లాదేశ్‌పై భారతదేశపు దూకుడు వైఖరి ఇలాగే కొనసాగితే, మేం కూడా ఒకప్పుడు మా భూభాగాలైన బెంగాల్, బీహార్, ఒడిశాలను మాకివ్వాలని డిమాండ్ చేస్తాం’ అని అన్నారు. సోమవారం ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు భారత్‌కు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించారు.
బంగ్లాదేశ్ నేతలు చేస్తున్న రెచ్చగొట్టే ప్రసంగాలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. విదేశీ శక్తులు ఆక్రమణకు వస్తే.. భారతీయులు లాలీపాప్‌లు తింటూ కూర్చుంటారా? అని చురకలంటించారు. సోమవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై భారత్ సోమవారం ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్‌తో తాము సానుకూల, నిర్మాణాత్మక, పరస్పర ప్రయోజనకర సంబంధాలను కోరుతున్నామని తెలిపింది. ఢాకాలో జరిగిన సమావేశంలో బంగ్లా విదేశాంగ కార్యదర్శి మొహమ్మద్ జషీమ్ ఉద్దీన్‌కు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఈ విషయాలను స్పష్టం చేశారు. షేక్ హాసీనా భారత్‌కు పారిపోయిన తర్వాత భారత ఉన్నతాధికారి ఒకరు బంగ్లాదేశ్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి. హిందువులపై దాడులు, హిందూ సాధువు చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్ట్ కారణంగా ఇటీవల భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు క్షీణించాయి.