ముంబై: ఆర్థిక నేరగాళ్లను సకాలంలో అరెస్ట్ చేయడంలో దర్యాప్తు సంస్థలు విఫలమయ్యాయని ముంబైలోని ఓ స్పెషల్ కోర్టు వ్యాఖ్యానించింది. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటివారు విదేశాలకు పారిపోవడానికి కారణం వారిని సకాలంలో దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేయకపోవడమేనని పేర్కొన్నది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యోమేష్ షా పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తనకు బెయిలు మంజూరైందని, అయితే విదేశాలకు వెళ్లాలంటే, ముందుగా కోర్టు అనుమతి పొందాలని షరతు విధించారని, ఆ షరతును సడలించాలని వ్యోమేష్ కోరారు. ఈ పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది. అయితే ఈ పిటిషన్ను అనుమతిస్తే, నీరవ్ మోదీ, మాల్యా, మెహుల్ చోక్సీ వంటివారి వల్ల ఎదురైన పరిస్థితులు వస్తాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వాదించింది. ఈడీ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఈ ముగ్గురినీ సకాలంలో అరెస్ట్ చేయడంలో దర్యాప్తు సంస్థలు విఫలమవడం వల్లే వారు దేశం విడిచి వెళ్లిపోగలిగారని వ్యాఖ్యానించింది.