ముంబై, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ):మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు తన ఆయుధాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్‌కు అప్పగించి లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ సెంట్రల్ వింగ్ టెక్నికల్ హెడ్ ఇర్రి మోహన్‌రెడ్డితోపాటు తన సహచర మావోయిస్టులు 61 మంది ఆయుధాలను అప్పగించి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.
వీరి లొంగుబాటును ఓ భారీ బహిరంగ సభగా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ సందర్భంగా వివిధ రాష్ర్టాల్లో మల్లోజులపై ఉన్న దాదాపు రూ.6 కోట్ల రివార్డును ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అప్పగించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో మోస్ట్ వాంటెడ్‌గా మల్లోజుల ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. మావోయిస్టు ఉద్యమానికి వ్యతిరేకంగా జరిగిన పరిణామాల్లో ఇది అతిపెద్ద విజయమని అభివర్ణించారు.