Mallikarjun Kharge | న్యూఢిల్లీ, అక్టోబర్ 24: వయనాడ్లో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమంలో ఆ పార్టీ చీఫ్, దళిత నేత మల్లికార్జున ఖర్గేకు తీవ్ర అవమానం జరిగిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. నకిలీ గాంధీ కుటుంబంతో జత కట్టిన ఖర్గే ఆఖరికి పార్టీ అధ్యక్షుడైనప్పటికీ లైన్లో వేచి ఉండాల్సిన దుస్థితి వచ్చిందని అన్నారు.
దళితుడైనందునే గాంధీ కుటుంబం ఆయనను నామినేషన్ కార్యక్రమంలో దూరంగా ఉంచి అవమానించిందని పేర్కొంటూ ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ నామినేషన్ వేస్తుండగా, ఖర్గే గది బయట వేచి చూస్తున్న వీడియోను విడుదల చేశారు. బీజేపీ జాతీయ ప్రతినిధి గౌరవ్ భాటియా గురువారం మీడియాతో మాట్లాడుతూ నామినేషన్ సందర్భంగా దళిత నేత మల్లికార్జున ఖర్గేను ఆ పార్టీ అవమానించిందని అన్నారు. సీతారాం కేసరి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగిందని అన్నారు.
దళితులు, వెనుకబడిన తరగతుల వారిని అవమానించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని పేర్కొన్నారు. నామినేషన్ సందర్భంగా ప్రియాంక తన అఫిడవిట్లో తన భర్త రాబర్ట్ వాద్రా నికర ఆస్తుల విలువను ఆదాయపు పన్ను శాఖ పేర్కొన్న మొత్తం కన్నా తక్కువ చూపారని ఆరోపించారు. ఖర్గేకు అవమానం జరిగిందని వస్తున్న వార్తలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. నామినేషన్ సమర్పించే గదిలో ఐదుగురు మాత్రమే ఉండాలని జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఖర్గే గది బయట ఉన్నారని తెలిపింది.