భోపాల్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా బీజేపీ నేతలు పవిత్ర స్నానాలు ఆచరించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తీవ్రంగా విమర్శించారు. వారు గంగా నదిలో మునిగితే దేశంలో పేదరికం తొలిగిపోతుందా? ఆకలితో ఉన్నవారి కడుపులు నిండుతాయా? అని ప్రశ్నించారు. సోమవారం మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో జరిగిన ‘జై బాపు, జై భీమ్, జై సంవిధన్’ సభలో మల్లికార్జున్ ఖర్గే మాట్లాడారు. ‘నేను ఎవరి విశ్వాసాన్ని ప్రశ్నించాలనుకోవడం లేదు. ఎవరైనా తప్పుగా భావిస్తే నేను క్షమాపణలు కోరుతున్నా. అయితే నాకు చెప్పండి. ఒక పిల్లవాడు ఆకలితో చనిపోతున్నప్పుడు, స్కూల్‌కు వెళ్లనప్పుడు, కార్మికులకు వారి బకాయిలు అందనప్పుడు, అటువంటి సమయంలో ఈ వ్యక్తులు (బీజేపీ నేతలు) వేల రూపాయలు ఖర్చు చేసి (గంగా నదిలో) మునగడానికి పోటీ పడుతున్నారు. ఫొటోల్లో బాగా కనిపించే వరకు వారి స్నానాలు కొనసాగుతాయి’ అని విమర్శించారు.
కాగా, ఇలాంటి వ్యక్తులు దేశానికి మేలు చేయలేరని మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ‘దేవుడిపై మాకు విశ్వాసం ఉంది. ప్రజలు ప్రతిరోజూ ఇంట్లో పూజలు చేస్తారు. అందరు మహిళలు పూజ తర్వాత తమ ఇళ్ల నుంచి బయటకు వస్తారు. ఎటువంటి సమస్య లేదు. కానీ మతం పేరుతో పేదలు దోపిడీకి గురవుతున్నారన్నది మా సమస్య’ అని అన్నారు. అయితే ఖర్గేకు ముందు మాట్లాడిన రాహుల్ గాంధీ కూడా బీజేపీపై మండిపడ్డారు.
మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ, అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ద్వేషంతో కోట్లాది మంది హిందువుల విశ్వాసంపై దాడి చేస్తున్నదని ఆరోపించారు. మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మరే ఇతర మత విశ్వాసం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అని తాను సవాల్ చేస్తున్నానని అన్నారు.