Mallikarjun Kharge | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అనాలోచితంగా ఇస్తున్న గ్యారెంటీలపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ర్టాల బడ్జెట్ ఆధారంగా కాంగ్రెస్ నాయకులు గ్యారెంటీలను ప్రకటించాలని, లేకుంటే ఈ హామీల వల్ల రాష్ర్టాలు దివాలా తీసే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. కర్ణాటకలో అమలవుతున్న ఉచిత బస్సు స్కీమ్‌ను (శక్తి స్కీమ్) నిలిపేయనున్నట్టు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పరోక్షంగా సంకేతాలివ్వడంపై ఈ సందర్భంగా ఖర్గే మండిపడ్డారు. ఈ మేరకు గురువారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.
‘కర్ణాటకలో మీరు (కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం) ఐదు గ్యారెంటీలను ప్రకటించి అధికారంలోకి వచ్చారు. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు మహారాష్ట్రలో 5 గ్యారెంటీలను ప్రకటించాం. జార్ఖండ్‌లోనూ దాదాపు ఇదే విధానాన్ని పాటించాం. అయితే, ఇప్పుడు మీరు తీరిగ్గా 5 గ్యారెంటీల్లో ఒక హామీని నిలిపేస్తున్నట్టు ప్రకటించారు. మీ ప్రకటన తర్వాత దినపత్రికలను చదివారా? వాళ్లేం రాశారో చూశారా? నా అంచనా ప్రకారం మీరు పత్రికలను చదివినట్టు లేదు. అయితే, నేను అన్ని పత్రికలను చదువుతాను. అందుకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నా. (మహారాష్ట్ర పార్టీ నేతలను ఉద్దేశిస్తూ..) త్వరలో జరగబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో 5, 6, 7, 8 ఇలా హామీలను పెంచుకొంటూ పోకండి. రాష్ర్టాల బడ్జెట్ ఆధారంగా హామీలు ప్రకటించండి. లేదంటే రాష్ర్టాలు దివాలా తీసే పరిస్థితికి చేరొచ్చు. ప్రణాళికా రహిత విధానం కారణంగా ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే.. భవిష్యత్తు తరాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. (కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ..) రోడ్లు వేసేందుకు కూడా డబ్బు లేకపోతే ఎలా? ఇలాగైతే ప్రభుత్వంపై ప్రజలే తిరగబడతారు. ప్రభుత్వం విఫలమైతే భవిష్యత్తు తరానికి చెడ్డపేరు తప్ప మరొకటి మిగలదు’ అంటూ ఖర్గే ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హామీల కారణంగా రాష్ర్టాలకు దివాలా తీసే పరిస్థితి రానీయవద్దని నేతలకు సూచించారు.
మీడియా సమావేశంలో ఖర్గే ఒకింత అసహనంతో మాట్లాడుతుండగా ఇంతలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కలుగజేసుకొన్నారు. ‘శక్తి స్కీమ్‌ను కేవలం సమీక్షిస్తామని మాత్రమే డీకే చెప్పారం’టూ ఖర్గేకు నచ్చజెప్పబోయారు. దీంతో స్పందించిన ఖర్గే.. ‘డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యల వల్ల ఇప్పుడు ప్రతిపక్ష బీజేపీ మనల్ని నిలదీసేలా చేశాయి. అలాంటి ఛాన్స్ ప్రతిపక్షాలకు మనమెందుకు ఇవ్వాలి?’ అంటూ ప్రశ్నించారు.
ఖర్గే చురకల నేపథ్యంలో నష్టనివారణ చర్యలకు దిగిన డీకే తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పుకొచ్చారు. “శక్తి’ స్కీమ్‌పై నా వ్యాఖ్యలను వక్రీకరించారు. ఈ స్కీమ్‌ను నిలిపివేసే ప్రసక్తే లేదు. ఈ స్కీమ్‌పై వచ్చే సూచనలను పరిగణనలోకి తీసుకొంటామని మాత్రమే నేను అన్నాను. అయితే, దీన్ని బీజేపీ నేతలు ఓ వివాదంగా మార్చారు. కర్ణాటక ప్రభుత్వ గ్యారెంటీ మాడల్‌కు నేను ఎంతో గర్వపడుతున్నా. ఈ మాడల్ దేశానికే ఆదర్శం. బీజేపీతో సహా అన్ని పార్టీలు ఈ మాడల్‌ను తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లోనూ అనుసరిస్తున్నాయి. ఇచ్చిన గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తాం. మా మాడల్‌తో కర్ణాటక ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు’ అని పేర్కొన్నారు. కాగా బుధవారం డీకే శివకుమార్ మాట్లాడుతూ.. చాలా మంది మహిళలు తాము బస్సు టికెట్లకు డబ్బులు కడతామని చెప్తూ ప్రభుత్వానికి సోషల్ మీడియా, ఈమెయిళ్ల ద్వారా చెప్తున్నారని పేర్కొన్నారు. శక్తి స్కీమ్‌ను ఒకవిధంగా నిలిపేయనున్నట్టు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డితో త్వరలోనే సమావేశమై దీనిపై చర్చిస్తానని కూడా వెల్లడించారు. దీనిపై ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇప్పుడు తాను అలా అన్లేదని మాటమార్చారు. కాగా, శక్తి పథకం వల్ల ప్రభుత్వంపై ఏడాదిన్నరలో రూ.7,507.35 కోట్ల భారం పడింది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకే ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని ఆపేసి మహిళలను మోసం చేసేందుకు సిద్ధమవుతున్నదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
అమలు చేయలేని గ్యారెంటీలను ఇస్తూ కాంగ్రెస్ ప్రజలను మోసగిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఖర్గే తాజా వ్యాఖ్యలతో ఆ పార్టీ అసలు రంగు బయటపడిందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో శుక్రవారం విమర్శలు గుప్పించారు. ‘హామీల ప్రకటన సులభం. వాటి అమలే కష్టం. ఇప్పుడు ఆ విషయం కాంగ్రెస్‌కు తెలిసొచ్చింది. తాము ప్రకటిస్తున్న హామీలను అమలు చేయలేమని కాంగ్రెస్ నేతలకు కూడా తెలుసు. అయితే ప్రజలను మోసపుచ్చుతూ వాళ్లు ఆర్భాటపు గ్యారెంటీలను ప్రకటిస్తున్నారు. కర్ణాటకలో అభివృద్ధి మాట ఎప్పుడో మరిచిపోయారు. స్కీమ్‌లను నిలిపేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సమాయానికి వేతనాలు ఇచ్చే పరిస్థితే లేదు. రుణమాఫీ కోసం తెలంగాణలో రైతులు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలపై దేశ ప్రజలు అప్రమత్తతతో ఉండాల్సిన అవసరం ఉన్నది’ అని మోదీ విమర్శించారు.