న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) కీలక ఆదేశాలు ఇచ్చింది. పోలింగ్ బూత్‌లకు చెందిన సీసీటీవీ కెమెరా, వెబ్‌కాస్టింగ్, వీడియో ఫూటేజ్‌లను.. ఎన్నికలు ముగిసిన 45 రోజుల తర్వాత ధ్వంసం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఆదేశాలు ఇచ్చింది. తమ వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ డేటాను దుర్వినియోగం చేస్తున్నారని ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ వీడియో ఫూటేజ్ డేటాను ధ్వంసం చేయాలని సూచించినట్లు ఈసీ చెప్పింది. మే 30వ తేదీన ఇదే అంశంపై రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లకు ఈసీ లేఖలు రాసింది.
ఎన్నికల సమయంలో వేర్వేరు దశల్లో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సీసీటీవీ, వెబ్‌కాస్టింగ్ చేయాలని గతంలో రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఆదేశాలు ఇచ్చామని, వాస్తవాని ఎన్నికల చట్టాల ప్రకారం ఇలాంటి రికార్డింగ్‌లు తప్పనిసరి కాదు అని, కానీ ఆ వీడియోలను అంతర్గత అంచనా వేసేందుకు కమిషన్‌కు ఉపయోగపడుతాయని ఈసీ తెలిపింది. కానీ ఎన్నికల్లో పోటీ చేయని వారు.. తమ ఎలక్ట్రానిక్ డేటాను దుర్వినియోగం చేస్తున్నట్లు ఇటీవల గుర్తించామని ఈసీ పేర్కొన్నది. తమ డేటాతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, సోషల్ మీడియాలో విద్వేషకర ప్రచారం జరుగుతుందని ఈసీ చెప్పింది. ఈ నేపథ్యంలోనే సీసీటీవీ డేటా, వెబ్‌కాస్టింగ్, ఫోటోగ్రఫీకి సంబంధించిన డేటాను 45 రోజుల వరకు మాత్రమే నిల్వ చేయాలని, ఆ తర్వాత దాన్ని ధ్వంసం చేయాలని రాష్ట్ర సంఘాలకు ఆదేశాలు ఇచ్చినట్లు ఎన్నికల సంఘం పేర్కొన్నది.
ఎన్నికల పోలింగ్ సరళిపై ఎలక్ట్రానిక్ డేటా కావాలని ఎవరైనా పిటీషన్ దాఖలు చేస్తానే ఆ డేటాను నిక్షిప్తం చేయాలని, లేదంటే ఆ నియోజకవర్గ డేటాను ధ్వంసం చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు ఈసీ తెలిపింది. డేటాను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఈసీ చెప్పింది. ఈసీ చేసిన ప్రతిపాదనల ఆధారంగా కేంద్ర న్యాయ శాఖ.. ఎన్నికల నిర్వహణకు చెందిన రూల్ 93ని సవరించింది. దాని ఆధారంగానే పేపర్లు కానీ డాక్యుమెంట్లు కానీ పబ్లిక్ చేసేందుకు ఆంక్షలు విధించారు.