ముంబై, జూలై 31 (నమస్తే తెలంగాణ) : సుమారు 17 ఏండ్ల క్రితం దేశంలో సంచలనం సృష్టించిన మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బీజేపీ మాజీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్ట్‌నెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ సహా ఏడుగురు నిందితులను గురువారం నిర్దోషులుగా ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రత్యేక న్యాయమూర్తి లహోటి మాట్లాడుతూ కేవలం అనుమానం ఆరోపణలతో కేసును ముందుకు తీసుకువెళ్లలేమని, నిందితులపై మోపిన అభియోగాలను సహేతుకమైన సందేహానికి మించి నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని తెలిపారు. ఈ కేసుకు ఉపా చట్టం వర్తించదని పేర్కొంది. ఉగ్రవాదానికి మతం ఉండదని, అయితే నైతిక ఆధారంతో న్యాయస్థానాలు శిక్షను విధించవని ఆయన అన్నారు.
మహారాష్ట్రలో ముస్లింలు అధికంగా నివసించే మాలేగావ్ పట్టణంలో 2008, సెప్టెంబర్ 29న రంజాన్ మాసం సమయంలో ఒక బైక్‌లో ఉంచిన బాంబు పేలిన ఘటనలో ఆరుగురు మరణించగా, వంద మందికి పైగా గాయపడ్డారు. హిందూ అతివాద సంస్థలు ఈ ఉగ్ర చర్యకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. అంతకుముందు హిందువులపై ముస్లింలు జరిపిన దాడులకు ప్రతీకారంగా అభినవ్ భారత్ అనే సంస్థ ఈ కుట్రకు పాల్పడిందని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఆరోపించింది. పేలుడుకు ఉపయోగించిన బైక్ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్దని, ఆ పేలుడులో ఆమెతో పాటు అప్పటి ఆర్మీ అధికారి లెఫ్ట్‌నెంట్ కర్నల్ పురోహిత్ ప్రమేయం కూడా ఉందని తెలిపింది. పురోహితే ఆర్డీఎక్స్ తీసుకువచ్చి బైక్‌లో అమర్చారని అభియోగాలు మోపింది. అయితే బైక్ ప్రజా ్ఞఠాకూర్దేనని నిర్ధారించే బలమైన ఆధారాలు లేవని, పైగా పేలుళ్లకు రెండేళ్ల ముందు సన్యాసినిగా మారిన ఆమె అన్ని రకాల ప్రాపంచిక వస్తువులను విడిచిపెట్టేశారని న్యాయస్థానం తెలిపింది. ప్రాసిక్యూషన్ ఆరోపణలకు ప్రధాన సాక్ష్యులు ఎలాంటి మద్దతు ఇవ్వలేదని పేర్కొంటూ, ఈ కేసులోని నిందితులందరినీ నిర్దోషులుగా విడిచిపెట్టింది. అంతేకాకుండా పేలుడు మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి 50 వేల వంతున పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది.
మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో తనను నిర్దోషిగా విడిచిపెట్టడం హిందూత్వ విజయంగా ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. తీర్పు అనంతరం న్యాయస్థాన ప్రాంగణంలో కళ్ల నిండా నీళ్లతో ఆమె ఉద్వేగంగా మాట్లాడుతూ 17 ఏండ్ల పాటు తన జీవితం నాశనమైందని అన్నారు. కొంతమంది మానసిక రోగులకు తాను బాధితునిగా మారానని ఎవరి పేరును ప్రస్తావించకుండా పురోహిత్ వ్యాఖ్యానించారు.
ఈ పేలుడులో షేక్ లియాఖత్ మొయియుద్దీన్ తన కూతురిని కోల్పోయాడు. ‘ప్రత్యేక కోర్టు గురువారం ఇచ్చిన నిర్ణయాన్ని మేము అంగీకరించము. చాలా తప్పుడు నిర్ణయం తీసుకోబడింది. హేమంత్ కరరే అనేక ఆధారాలను సమర్పించారు. మేము సుప్రీంకోర్టుకు వెళ్తాం’ అని మొయియుద్దీన్ అన్నారు.