లక్నో: అత్యాచారం కేసులో ఒక వ్యక్తిని నిర్దోషిగా హైకోర్టు ప్రకటించింది. ఆరోపణలున్న పురుష భాగస్వామిదే ఎల్లప్పుడు తప్పుకాదని వ్యాఖ్యానించింది. (Male Partner Not Always Wrong) ఇలాంటి కేసులో ఆరోపణల రుజువు బాధ్యత ఇద్దరిపై ఉంటుందని పేర్కొంది. ఒక వ్యక్తి పెళ్లి పేరుతో తనపై అత్యాచారం చేశాడని, ఆ తర్వాత పెళ్లికి నిరాకరించాడని ఆరోపిస్తూ ఒక మహిళ 2019లో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను కులం పేరుతో దూషించినట్లు అతడిపై ఆరోపణలు చేసింది. దీంతో ఆ వ్యక్తిపై అత్యాచారం వంటి సెక్షన్లతోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, అత్యాచారం అభియోగం ఎదుర్కొన్న నిందితుడ్ని నిర్దోషిగా ప్రయాగ్రాజ్ ట్రయల్ కోర్టు ప్రకటించింది. మహిళను గాయపర్చిన సెక్షన్ 323 కింద మాత్రమే దోషిగా నిర్ధారించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 8న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై ఆ మహిళ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే తమ మద్య సంబంధం ఏకాభిప్రాయంతో కూడినదని ఆ వ్యక్తి కోర్టుకు తెలిపాడు. ఆ మహిళ తన మొదటి వివాహాన్ని, కులాన్ని దాచిందని ఆరోపించాడు. అందుకే పెళ్లికి నిరాకరించినట్లు కోర్టుకు వెల్లడించాడు.
మరోవైపు న్యాయమూర్తులు రాహుల్ చతుర్వేది, నంద్ ప్రభా శుక్లాతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్పై విచారణ జరిపింది. అప్పటికే వివాహమై, దాన్ని రద్దు చేసుకోకుండా, కులాన్ని దాచిన ఆ మహిళ ఎలాంటి అభ్యంతరం, సంకోచం లేకుండా ఐదేళ్లపాటు ఆ వ్యక్తితో శారీరక సంబంధం కొనసాగించిన విషయాన్ని కోర్టు గ్రహించింది. ‘ఇద్దరూ అలహాబాద్, లక్నోలోని అనేక హోటళ్ళు, లాడ్జీలను సందర్శించి ఆనందించారు. ఎవరు ఎవరిని మోసం చేశారో నిర్ధారించడం కష్టం’ అని వ్యాఖ్యానించింది.
కాగా, అత్యాచారం కేసులో పురుష భాగస్వామిదే ఎప్పుడూ తప్పుకాదని కోర్టు పేర్కొంది. ‘లైంగిక నేరాలకు సంబంధించిన చట్టం స్త్రీ కేంద్రీకృతం కావడం సరైనదే. కానీ పురుష భాగస్వామిదే ఎప్పుడూ తప్పు అని అర్థం కాదు. ఇలాంటి కేసులో ఆరోపణల రుజువు బాధ్యత ఫిర్యాదుదారు, నిందితులపై ఉంటుంది’ అని పేర్కొంది. అలాగే తన కులం ఏమిటన్నది ఆ మహిళ స్పష్టం చేయలేదని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి నిర్దోషిగా దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.