Air India | ఎయిర్ ఇండియా మరోసారి మరో వివాదంలో చిక్కుకున్నది. బెంగళూరు నుంచి శాన్ఫ్రాన్సిస్కో వెళ్తున్న విమానంలో నిర్లక్ష్యపూరిత ఘటన వెలుగు చూసింది. విమానంలో ఓ ప్రయాణికుడికి అందించి ఆహారంలో బ్లేడ్ కనిపించింది. అయితే, ఘటనపై ఎయిర్‌లైన్ కంపెనీ సైతం తన తప్పును అంగీకరించింది. ఈ వ్యవహారంపై ఎయిర్‌లైన్స్ చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ రాజేష్ డోగ్రా మాట్లాడుతూ.. విమానంలో అతిథి ఆహారంలో వస్తువు కనిపించిందని ఎయిర్ ఇండియా ధ్రువీకరించింది. విచారణ అనంతరం క్యాటరింగ్ పార్టనర్ ఉపయోగించే కూరగాయల ప్రాసెసింగ్ యంత్రం నుంచి వచ్చిందని గుర్తించినట్లు పేర్కొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కూరగాయలను కట్ చేసిన తర్వాత ప్రాసెసర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నట్లు తెలిపింది.