Road Accident | పండుగ వేళ విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్‌లో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులను హర్యానాకు చెందిన వారుగా గుర్తించారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడగా హాస్పిటల్‌కు తరలించి, చికిత్స అందిస్తున్నారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం మేరకు.. ముజఫర్‌నగర్‌లోని టిటావి ప్రాంతంలోని పానిపట్-ఖాతిమా రహదారిపై ఉన్న ధాబా వద్ద ఆగి ఉన్న ట్రక్కును కారు ఢీకొట్టింది. దాంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురుఈ ప్రమాదంలో మరణించారు.
ఆ కుటుంబం కర్నాల్ నుంచి హరిద్వార్‌కు వెళుతోంది. చితాభస్మ నిమజ్జనం కోసం హరిద్వార్‌కు వెళుతున్న హర్యానా కర్నాల్ జిల్లాలోని ఫరీద్‌పూర్‌కు చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ముజఫర్‌నగర్‌లోని పానిపట్-ఖాతిమా హైవేలోని బాగ్రా బైపాస్‌లోని ధాబా వద్ద ఆపి ఉంచిన ట్రక్కును కారు వెనుకకు ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బాధిత కుటుంబ పెద్ద ఇటీవల మరణించడంతో.. అతని కొడుకుతో పాటు ఇతర కుటుంబీకులు చితాభస్మాన్ని హరిద్వార్‌లోని గంగానదిలో నిమజ్జనం చేసేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు ప్రమాదానికి గురైంది. గాయాలతో ఓ వ్యక్తి ప్రమాదం నుంచి బయటపడగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.