న్యూఢిల్లీ : డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్ల (wrestlers) ఆందోళన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వంపై మాజీ రెజ్లర్, ద్రోణాచార్య అవార్డు విజేత మహవీర్ పొఘట్ తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. బ్రిటిషర్లను తరిమికొట్టిన తరహాలో ప్రస్తుత ప్రభుత్వానికి ప్రజలు పాతరేస్తారని మోదీ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. మహిళా రెజ్లర్ల పరిస్ధితి చూడలేకపోతున్నామని, ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
హర్యానాలోని తన స్వగ్రామం బలైలో ఆయన మీడియాతో మాట్లాడారు. రెజ్లర్లకు రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్ మద్దతు ఇవ్వడంపై స్పందిస్తూ దేశ ఆడపడుచుల బాధను రైతు నేతలు అర్ధం చేసుకున్నారని, దేశం మొత్తం ఇప్పుడు కలిసికట్టుగా రెజ్లర్ల పక్షాన నిలబడిందని అన్నారు. వారి ఉద్యమం నిర్ణయాత్మక దశకు చేరుకున్నదని చెప్పారు. ఖాప్ పంచాయతీల నుంచి సామాజిక, రైతు సంఘాల వరకూ దేశ ప్రజలు భారీ ఉద్యమాన్ని చేపట్టారని పేర్కొన్నారు. బలై గ్రామానికి పేరుతెచ్చిన పొఘట్ సిస్టర్స్‌కు సంఘీభావంగా, మహిళా రెజ్లర్లకు న్యాయం జరగాలని కోరుతూ గ్రామస్తులు పంచాయత్ నిర్వహించాలని నిర్ణయించారు.
తాను అన్నీ పణంగా పెట్టి తన కూతుళ్లు పతకాలు సాధించే దిశగా తీర్చిదిద్దానని, కానీ ఇప్పుడు వారి పరిస్ధితి దయనీయంగా ఉందని మహవీర్ పొఘట్ ఆందోళన వ్యక్తం చేశారు. రెజ్లర్లు వారి మెడల్స్‌ను గంగా నదిలో విసిరివేయాలని నిర్ణయం తీసుకోవడం బాధాకరమని అన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం స్పందించని పక్షంలో దేశ ప్రజలు బ్రిటీష్ వారిని తరిమికొట్టినట్టు ప్రభుత్వాన్ని సాగనంపుతారని హెచ్చరించారు. క్రీడాకారిణులు రెజ్లింగ్‌ను నిలిపివేయాల్సిన పరిస్ధితులు ఉన్నాయని, జూనియర్ ఆటగాళ్ల భవితవ్యం అభ్రదతతో కొట్టుమిట్టాడుతుందని అన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై చర్యలు చేపట్టాలని కోరుతూ గత కొద్దినెలలుగా రెజ్లర్లు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే.
Read More