Eknath Shinde | లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ ఓటమికి ‘ఉల్లి’ కారణం అని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే పేర్కొన్నారు. రాష్ట్రంలోని 48 స్థానాలకు గాను 17 స్థానాలకు ఎన్డీఏ పరిమితమైంది. లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో నెలకొన్న గడ్డు పరిస్థితులతో తమ కూటమి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. నాసిక్ ప్రాంతంలో ‘ఉల్లి’ ఏడిపించిందని చెప్పారు. మరఠ్వాడాలో సోయాబీన్, విదర్భలో పత్తి పంటలు తమ కూటమిని దెబ్బ తీశాయని పేర్కొన్నారు.
ఉల్లి, సోయాబీన్, పత్తి పంటలకు మద్దతు ధరలు కల్పించాలని కేంద్ర నూతన వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరతానని ఏక్నాథ్ షిండే తెలిపారు. ఇప్పటికే వ్యవసాయ సంబంధిత సమస్యలపై ఇప్పటికే ప్రధాని మోదీతో మాట్లాడానని అన్నారు. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలను నియంత్రించడానికి గతేడాది డిసెంబర్లో విదేశాలకు ఉల్లి ఎగుమతులను కేంద్రం నిషేధించడాన్ని మహారాష్ట్ర రైతులు వ్యతిరేకించారు. నిషేధ ఆంక్షలు ఎత్తేయాలని రైతులు ఆందోళన చేసినా.. పట్టించుకోని కేంద్రం గత నెల మొదటి వారంలో ఆంక్షలు ఎత్తేసింది.