చంద్రాపూర్, ఆగస్టు 27: మహారాష్ట్రలో అటు పంటలు సరిగా పండక, ఇటు ప్రభుత్వ మద్దతు లేక రైతన్నలు నిలువునా ప్రాణాలు తీసుకొంటున్నారు. ప్రాంతంతో, జిల్లాతో సంబంధం లేకుండా ప్రతి జిల్లాలో అన్నదాతలు తనువు చాలిస్తున్నారు. విదర్భ రీజియన్లోని చంద్రాపూర్ జిల్లాల్లో ఈ ఏడాది జనవరి నుంచి జూలై మధ్య ఏడు నెలల వ్యవధిలో 73 మంది రైతులు ఆత్మహత్య చేసుకొన్నారని జిల్లా అడ్మినిస్ట్రేషన్ గణాంకాలు వెల్లడించాయి. ఈ ఒక్క జిల్లాలోనే 2001-2023 మధ్య 1,148 మంది రైతులు పలు కారణాలతో తమ జీవితాలు ముగించగా, గత ఐదేండ్లలోనే 446 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2001, 2022 మధ్య ఆత్మహత్య చేసుకొన్న బాధిత రైతు కుటుంబాలకుగాను 329 రైతు కుటుంబాలను అధికార యంత్రాంగం ప్రభుత్వ పరిహారానికి అనర్హులుగా తేల్చడం గమనార్హం. అర్హులుగా తేల్చిన వారికి అయినా పూర్తిస్థాయిలో పరిహారం ఇచ్చారా అంటే అదీ లేదు. అర్హులుగా తేల్చిన వారిలో కూడా ఇంకా పదుల సంఖ్యలో కుటుంబాలకు అందాల్సిన పరిహారం పెండింగ్లో ఉన్నది.
వేల హెక్టార్లలో పంట నష్టం
పెరిగిన పంట పెట్టుబడులు, ప్రకృతి వైపరీత్యాలు రైతులను కష్టాల్లోకి నెడుతున్నాయి. పంట నష్టాలు, అప్పుల బాధలే రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది జూన్-జూలై నెలల్లో సంభవించిన వరదల కారణంగా చంద్రాపూర్ జిల్లాలో 64,379 మంది రైతులకు చెందిన 54,514 హెక్టార్ల మేర పంట దెబ్బతిన్నదని వ్యవసాయ శాఖ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. గోండ్పిపరీ తహశీల్ పరిధిలో అధికంగా 12,571 హెక్టార్ల పంట నష్టం జరిగిందని తెలిపారు. జిల్లాలో వరదలకు 852 గ్రామాలు ప్రభావితం అయ్యాయని చెప్పారు.