TET paper leak : దేశంలో పేపర్ లీకేజీలు కలవరపెడుతున్నాయి. ఇటీవల నీట్ పేపర్ లీకేజీతో లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళనకు గురికాగా.. తాజాగా మహారాష్ట్రలో మరో పేపర్ లీకేజీ జరిగింది. ఆదివారం నిర్వహించనున్న టెట్ పేపర్ లీకైంది. దీంతో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్రలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (మహా టెట్ 2023) పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం, జూన్ 28న నిర్వహించాల్సి ఉంది. అయితే, పరీక్షకు ఒక్క రోజు ముందు.. శనివారం ముంబై సమీపంలోని భివండిలో పేపర్ లీకైంది.
దీనిపై పోలీసులకు, రాష్ట్ర విద్యాశాఖకు సమాచారం అందింది. స్పందించిన పోలీసులు భివండిలో టెట్ పేపర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై విచారణ జరిపి, పేపర్ లీకేజీ నిజమే అని గుర్తించిన అధికారులు.. ఆదివారం జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి పరీక్ష తేదీ వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తామని మహారాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. అలాగే, ఈ పేపర్ లీకేజీపై విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. పరీక్ష వాయిదా వల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఇబ్బంది కలగనుంది. పరీక్షకు పూర్తిగా సిద్ధమైన తర్వాత ఇలా వాయిదా పడటంతో కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ బాధ్యతారాహిత్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం టెట్ పరీక్షకు అధికారులు అంతా సిద్ధం చేశారు. పేపర్ 1, పేపర్ 2 జరగాల్సి ఉంది. పేపర్ 1 ఉదయం 10.30 గంటల నుంచి పేపర్ 2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరగాల్సి ఉంది. పెన్, పేపర్ మోడ్‌లో నిర్వహించే ఈ పరీక్షలో ప్రతి పేపర్లో 150 ప్రశ్నలు ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ లేదు. ఈ పరీక్ష మరాఠి, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, హిందీ, గుజరాతీ, సింధి, బెంగాలి, కన్నడ భాషల్లో ఉంటుంది.