ముంబై : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్‌యూవీని ట్రక్కు ఢీకొట్టిన సంఘటనలో ఐదుగురు మహిళలు సహా ఏడుగురు మృతి చెందగా.. మరో పది మంది గాయపడ్డారు. ఈ ఘటన లాతూర్ – అంబోజోగై హైవేపై పై నంద్‌గావ్ ఫాటా వద్ద ఉదయం ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
మృతులు, క్షతగాత్రులు లాతూర్ జిల్లాలోని సాయి, ఆర్వీ గ్రామాలకు చెందిన వారనీ, ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బీడ్‌లోని అంబోజోగై తహసీల్‌కు వెళ్తున్న సమయంలో ఎస్‌యూవీని ట్రక్కు ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఒకరు తొమ్మిదేళ్ల బాలుడు సైతం ఉన్నాడు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న మహారాష్ట్ర సామాజిక న్యాయశాఖ మంత్రి ధనంజయ్ ముండేతో పాటు సీనియర్ పోలీసులు ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.