Maharastra Cabinet | మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన క్యాబినెట్ సహచరులకు శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేశారు. రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో కీలకమైన హోంశాఖ, లా అండ్ జ్యుడిషియరీ శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేకు పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖలను కేటాయించారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, పట్టణాభివృద్ధి ప్రణాళికలో ఈ రెండు శాఖలు కీలకం కానున్నాయి. అయితే, సీఎంగా తప్పుకున్నందుకు హోంశాఖ తనకు ఇవ్వాలని ఏక్ నాథ్ షిండే కోరినట్లు వార్తలొచ్చాయి.
మరో డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్‌కు ఆర్థికం అండ్ ప్లానింగ్, ఎక్సైజ్ శాఖలను కేటాయించారు. రాష్ట్ర ద్రవ్య విధానం, వనరుల సమీకరణలో ఈ శాఖలు కీలకం. అధికార మహాయుతి భాగస్వామ్య పక్షాలు బీజేపీ, శివసేన (ఏక్ నాథ్ షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) నేతలతో సంప్రదింపుల తర్వాత మంత్రులకు సీఎం ఫడ్నవీస్ శాఖలు కేటాయించారు. చంద్రశేఖర్ బవాంకులెకు రెవెన్యూశాఖ, రాధాకృష్ణ విఖె పాటిల్‌కు జల వనరులు, హసన్ ముష్రిఫ్‌కు వైద్య విద్యాశాఖ కేటాయించారు.