Maharashtra | మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరన్న విషయమై సస్పెన్స్ వీడిపోనున్నది. బుధవారం బీజేపీఎల్పీ పక్ష సమావేశంలో పార్టీ నేతను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీలను కేంద్ర పరిశీలకులుగా బీజేపీ నాయకత్వం ప్రకటించింది. కొత్త సీఎం ఎవరన్న విషయం వెల్లడించకున్నా.. బీజేపీ సీనియర్ నేత ఒకరు మాత్రం తదుపరి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అని చెప్పారు. ఈ నెల ఐదో తేదీన ముంబైలోని ఆజాద్ మైదాన్ లో కొత్త సీఎం ప్రమాణం చేస్తారని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ తదితరులు హాజరు కానున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి 288 స్థానాలకు 230 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీకి 132, ఏక్ నాథ్ షిండే సారధ్యంలోని శివసేనకు 57, అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీకి 41 సీట్లు వచ్చాయి. ఇదిలా ఉంటే రెండో దఫా సీఎంగా అవకాశం ఇవ్వకపోవడంపై ఆపద్ధర్మ సీఎం ఏక్ నాథ్ షిండే అసంతృప్తికి గురైనట్లు సమాచారం. ఎన్నికల ప్రచారంతో అలసిపోయిన తాను విశ్రాంతి కోసం సతారా జిల్లాలోని సొంత గ్రామానికి వెళ్లారు.
బుధవారం బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరుగనున్న నేపథ్యంలోని వర్ష బంగళాలోని సీఎం కార్యాలయానికి బీజేపీ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెళ్లి, ఆపద్ధర్మ సీఎం ఏక్ నాథ్ షిండేతో సమావేశం అయ్యారు. మరోవైపు బీజేపీ మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావాంకులే.. ప్రమాణ స్వీకార ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మంగళవారం రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్ నుంచి విమానంలో ముంబైకి చేరుకున్నారు.