ముంబై, మార్చి 4 (నమస్తే తెలంగాణ ) : మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. నిరుడు డిసెంబర్లో బీడ్ జిల్లాకు చెందిన సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్య కేసుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వెలుగులోకి రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను సీఎం ఫడ్నవీస్ ఆమోదించి, గవర్నర్‌కు పంపినట్టు తెలిపారు. వైద్యపరమైన కారణాలతో తాను రాజీనామా చేసినట్లు ధనంజయ్ ట్వీట్ చేశారు. కేజ్ తాలుకాలోని మస్సాజోగ్ సర్పంచ్‌గా ఉన్న సంతోష్ దేశ్‌ముఖ్‌ను కొందరు దుండగులు అతి కిరాతకంగా నరికి చంపారు. ఆ హత్య కేసులో వాల్మిక్ కరాడ్ ప్రధాన సూత్రధారి అని దర్యాప్తు సంస్థ పేరొంది. వాల్మిక్ కరాద్ నా ప్రత్యేకమైన మనిషి అని గతంలో ముండే స్వయంగా అంగీకరించాడు. హత్యకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు లీక్ కావడంతో ధనంజయ్ ముండే రాజీనామా చేశారు.