ముంబై: ఒక వ్యక్తి సరదాగా మూడేళ్ల చిన్నారి చెంపపై కొట్టాడు. గోడకు తల తగలడంతో ఆ పాప మరణించింది. భయపడిన ఆ వ్యక్తి చిన్నారి మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించాడు. మృతదేహాన్ని తగులబెట్టి చెట్ల పొదల్లో పడేశాడు. చిన్నారి హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులు మేనమామ అయిన ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. (Child Dies As Man Slaps) మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 18న థానేలోని ప్రేమ్‌నగర్‌లో ఇంటి నుంచి మూడేళ్ల బాలిక అదృశ్యమైంది. మూడు రోజుల తర్వాత ముంబై సమీపంలోని చెట్ల పొదల్లో కాలిన చిన్నారి మృతదేహం లభించింది.
కాగా, చిన్నారి హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ బాలిక మేనమామ అయిన 30 ఏళ్ల వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు. అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు.
మరోవైపు మేనకోడలిని ఉద్దేశపూర్వకంగా చంపలేదని పోలీసులకు అతడు తెలిపాడు. సరదాగా ఆడుతూ చెంపపై కొట్టినట్లు చెప్పాడు. అయితే వంటగది శ్లాబ్‌కు తల తగలడంతో పాప చనిపోయిందని తెలిపాడు. భయపడిన తాను ఆ చిన్నారి మృతదేహాన్ని తగులబెట్టి పొదల్లోకి విసిరేసినట్లు పోలీసులకు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో ఆ బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.