Viral News | ముంబై, (నమస్తే తెలంగాణ): ఒకరిని పెండ్లాడాల్సిన వధువు మరొకరిని పెండ్లి చేసుకోవడం అక్కడక్కడా చూస్తుం టాం. కాని.. కుమారుడు పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని అతడి తండ్రి పెండ్లి చేసుకోవడం అరుదుగా చూస్తుంటాం. మహారాష్ట్రలోని నాసిక్‌లో అలాంటి షాకింగ్ సంఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం ఓ తండ్రి తన కొడుకు కోసం ఒక అమ్మాయిని చూశాడు. పెళ్లి తేదీ కూడా ఖరారైంది. ఇద్దరి ఇండ్లలో పెండ్లి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.
అయితే, కాబోయే కోడలితో ఎప్పుడు ప్రేమలో పడ్డారో తెలియదు కాని ముహూర్తం చూడకుండా, కుటుంబసభ్యులకు చెప్పకుండా అబ్బాయి తండ్రి తనకు కోడలు కావాల్సిన అమ్మాయిని గుడిలో పెళ్లి చేసుకొని నేరుగా ఇంటికి తీసుకువచ్చాడు. పెళ్లి దుస్తుల్లో వచ్చిన ఆ కొత్త జంటను చూసి యువకుడు నిర్ఘాంతపోయాడు. భార్య కావాల్సిన యువతి చేసిన మోసానికి, తండ్రి చేసిన ద్రోహానికి జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. మరో అమ్మాయిని వెతికి తెచ్చి పెళ్లి చేస్తామని తండ్రి హామీ ఇచ్చినా ప్రేమ, పెండ్లిపై నమ్మకం పోయిందని ఆవేదన చెందాడు. ఇక సన్యాసిగా మారుతానని భీష్మించుకుని కూర్చున్నాడు.