Sanjay Raut | సుప్రీం కోర్టు రిటైర్డ్ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌పై శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు దాటినా మహారాష్ట్ర సీఎం పేరును ఇప్పటికీ ప్రకటించలేదు. అయితే, రాష్ట్రంలోని పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన గవర్నర్‌కు సూచించారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని.. ఎన్నికలు ఎలా జరిగాయి.. ఈవీఎంలను ఎలా అడ్డుకున్నది తెలుసునన్నారు. ఈవీఎంలపై జాతీయ ఉద్యమాన్ని చేపడుతామన్నారు.
ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కారణంగానే షిండే ప్రభుత్వం అధికారంలో కొనసాగిందని ఆయన ధ్వజమెత్తారు. మహారాష్ట్రలో ఆపద్ధర్మ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధమని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మద్దతు లభించిందని, దీనికంతటికీ అప్పటి సీజేఐ చంద్రచూడ్ బాధ్యత వహించాలన్నారు. శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన కేసులో విచారణను మాజీ సీజేఐ ఆలస్యం చేశారని సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమికి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ని తొలిసారిగా సంజయ్ రౌత్ తప్పుపట్టడమే కాదు.. గతంలోనే ఇలాంటి ఆరోపణలనే చేశారు. మహారాష్ట్రకు జరిగిన నష్టానికి డీవై చంద్రచూడ్దే బాధ్యత అని.. ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేదన్నారు.
జస్టిస్ చంద్రచూడ్ తన నిర్ణయాన్ని సకాలంలో ఇచ్చి ఉంటే.. భవిష్యత్తులో నేతలెవరూ పార్టీపై తిరుగుబాటు చేసేందుకు సాహసం చేసేవారు కాదన్నారు. జస్టిస్ చంద్రచూడ్‌ను చరిత్ర క్షమించదు. మహారాష్ట్ర గుర్తుంచుకుంటుందన్నారు. 40 మంది ఎమ్మెల్యేలు ఎన్నికైన పార్టీని మోసం చేసి అధికారంలోకి వచ్చారని.. సుప్రీంకోర్టు సకాలంలో నిర్ణయాన్ని వెలువరచకుండా ఓ విధంగా తలుపులు తెరిచారన్నారు. భవిష్యత్‌లో ఇలాంటివి జరగవచ్చని.. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత జస్టిస్ చంద్రచూడ్‌పై ఉందంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల ఫలితాలు వెలువడి పది రోజులు అవుతున్నా బీజేపీ ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిందని ప్రశ్నించారు. మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారని విమర్శించారు.