ముంబై: బీజేపీ పాలిత మహారాష్ట్రలో మరో మారు ఊర్ల పేర్లు (Rename) మారనున్నాయి. ఇప్పటికే ఔరంగాబాద్‌ను ఛత్రపతి శంభాజీ నగర్‌గా, ఉస్మానాబాద్‌ను ధారాశివ్‌గా మార్చిన ప్రభుత్వం తాజాగా మరో రెండు గ్రామాల పేర్లను మార్చాలని నిర్ణయించింది. ఇందులో సాంగ్లీ జిల్లాలోని ఇస్లామ్పూర్ (Islampur), రాయ్‌గడ్ జిల్లాలోని ఛత్రి నిజామ్పూర్ (Chhatri Nizampur) ఉన్నాయి. ఇస్లామ్పూర్ గ్రామానికి ఇషావర్పూర్గా మార్పుచేసింది. అదేవిధంగా ఛత్రి నిజామ్పూర్ను రాయ్గడ్వాడీగా పునఃనామకరణం చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు మంత్రి ఛగన్ భుజ్‌బల్ ప్రకటించారు.
ఇస్లామ్పూర్ను ఇషావర్పూర్గా మారుస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నది, ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. అదేవిధంగా ఛత్రి నిజామ్పూర్ను రాయ్గడ్వాడీ మార్చనున్నట్లు తెలిపారు. ఇస్లామ్పూర్ పేరును మార్చాలని హిందూ సంఘాలు 1980 నుంచి డిమాండ్ చేస్తున్నాయి. అదేవిధంగా ఛత్రపతి శివాజీ రాజ్యానికి రాజధానిగా ఉన్న ఛత్రి నిజామ్పూర్ పేరును మార్చాలని స్థానిక ఎమ్మెల్యేలు గతకొంతకాలంగా కోరుతున్నారు.
ఔరంగాబాద్, ఉస్మానాబాద్ జిల్లాల పేర్లను ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని గత ప్రభుత్వం మార్చిన విషయం తెలిసిందే. ఔరంగాబాద్‌ను ఛత్రపతి శంభాజీ నగర్‌గా, ఉస్మానాబాద్‌ను ధారాశివ్‌గా మార్పుచేసింది. అయితే ఈ జిల్లాల పేర్లను మార్చాలని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాఢీ ప్రభుత్వం 2022 జూన్‌లో నిర్ణయించింది. ఉద్ధవ్ మంత్రివర్గం ఔరంగాబాద్‌ను శంభాజీ నగర్‌గా మార్చాలని నిర్ణయించగా, షిండే ప్రభుత్వం దీనికి ఛత్రపతి శంభాజీ నగర్ అని పేరు పెట్టింది. అదేవిధంగా 2020లో అప్పటి ప్రభుత్వం ముంబై సెంట్రల్ స్టేషన్ పేరును శంకర్‌షేత్ ముర్కుటేగా మార్చింది.