Maharashtra Results | బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, సినీ నటుడు ఎజాజ్ ఖాన్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వెర్సెవో స్థానం నుంచి పోటీ చేశారు. ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్‌కు చెందిన ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) టికెట్‌పై బరిలో నిలిచారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా కేవలం 155 ఓట్లు మాత్రమే నటుడికి పోలయ్యాయి. కానీ, నోటాకు మాత్రం 1298 ఓట్లు వచ్చాయి. మహారాష్ట్రలో బీజేపీ కూటమి మహాయుతి ఆధిక్యం దిశగా సాగుతున్నది. ఈ క్రమంలో మహారాష్ట్రలో ఓ సీటుపై జోరుగా చర్చ సాగుతున్నది. ఓ సీటు ఏదో కాదు.. వెర్సోవా. తనను తాను ముంబయి భాయిజాన్‌గా చెప్పుకునే ఎజాజ్ ఓట్లు రాబట్టడంలో ఘోరంగా విఫలమయ్యాడు. శివసేన (యూబీటీ) తరఫున బరిలోకి దిగిన హరూన్ 1600 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి భారతిపై విజయం సాధించారు.
హరూన్‌కు 65,396 ఓట్లు పోలవగా.. భారతికి 63,796 ఓట్లు వచ్చాయి. నటుడు ఎజాజ్‌కు సోషల్ మీడియాలో 5.6 మిలియన్లకుపైగా ఫాలో అవర్స్ ఉన్నారు. వెర్సెవో స్థానం నుంచి 16 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వెర్సెవో కాంగ్రెస్ కంచుకోటగా ఉండగా.. శివసేన యూబీటీ అభ్యర్థి విజయం సాధించారు. ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) టికెట్‌పై పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించిన ఎజాజ్ ఖాన్ ‘దియా ఔర్ బాతీ హమ్’.. ‘కరమ్ అప్నా అప్నా’ తదితర షోల్లో కనిపించారు. రక్త్ చరిత్ర, అల్లా కే బందే తదితర చిత్రాల్లో నటించారు. ఎజాజ్‌పై పలు ఆరోపణలు ఉన్నాయి. డ్రగ్స్ ఆరోపణలతో జైలుకు వెళ్లారు. బిగ్‌బాస్-7లో పాల్గొన్న ఎజాజ్.. వివాదాలతో వార్తల్లో నిలిచాడు.