(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్/ముంబై, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ (66) దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం పుణె జిల్లాలోని బారామతిలో కుప్పకూలింది. ఈ ఘటనలో పవార్‌తో పాటు ముంబై వ్యక్తిగత భద్రతాధికారి (పీఎస్వో) వదీప్ జావద్, విమానాన్ని నడుపుతున్న కెప్టెన్ సుమిత్ కపూర్, కెప్టెన్ శాంభవి పాఠక్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి మృత్యవాతపడ్డారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ఉదయం 8.45 గంటల ప్రాంతంలో ఎయిర్‌పోర్టు రన్‌వేకు సమీపంలో ఈ విమానం కుప్పకూలింది. ప్రమాద తీవ్రతకు విమానం రెండు ముక్కలై మంటలు చెలరేగాయి. ఘటనాస్థలిలోనే విమానంలోని వాళ్లందరూ చనిపోయారని ప్రత్యక్షసాక్షులు పేర్కొన్నారు.
పవార్ మరణంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర అభివృద్ధికి పవార్ ఎంతో కృషి చేశారని ముర్ము అన్నారు. అట్టడుగు స్థానం నుంచి ప్రజా నాయకుడిగా ఎదిగిన పవార్ ప్రజల హృదయాల్లో ఎప్పుడూ నిలిచే ఉంటారని మోదీ తెలిపారు. పవార్ మరణం ఎన్డీయే కుటుంబానికి తీవ్ర నష్టమని అమిత్ షా అన్నారు. పవార్ కుటుంబానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తదితరులు సానుభూతి తెలియజేశారు. రాష్ట్రంలో మూడు రోజులు సంతాప దినాలుగా పాటిస్తామని సీఎం ఫడ్నవీస్ తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో గురువారం ఉదయం 11 గంటలకు జరుగనున్న అంత్యక్రియలకు ప్రధాని, హోం మంత్రి హాజరయ్యే అవకాశమున్నదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రమాదంలో కుట్ర కోణం
పవార్ విమాన ప్రమాదంలో రాజకీయ కుట్ర కోణం కనిపిస్తున్నదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనుమానం వ్యక్తం చేశారు. ‘పవార్ బీజేపీని వీడాలన్న యోచనలో ఉన్నారని రెండురోజుల కిందటే విన్నా. ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది. దేశంలోని రాజకీయ నాయకుల భద్రతపై ఈ ప్రమాదం అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలి. మరే ఇతర ఏజెన్సీలపై మాకు నమ్మకం లేదు’ అని మమత అన్నారు. ఆమె వ్యాఖ్యలను తాము సమర్థిస్తున్నామని, ఈ ఘటనపై పారదర్శకమైన దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, శివసేన యూబీటీ ఎంపీ అనిల్ దేశాయ్, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తదితరులు డిమాండ్ చేశారు. కాగా ఇది ప్రమాదవశాత్త్తు జరిగిన దుర్ఘటన అని, దీనికి రాజకీయ రంగు పులమద్దని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ అన్నారు.
ఢిల్లీకి చెందిన వీఎస్ఆర్ సంస్థకు చెందిన లియర్ జెట్-45 మోడల్ విమానంలో చివరగా అజిత్ పవార్ ప్రయాణించారు. ఇదే మోడల్ విమానం 2023లో ముంబై విమానాశ్రయంలో క్రాష్ ల్యాండ్ అయ్యి రెండు ముక్కలైంది. ప్రమాద ంలో ఆరుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాగా, తమ విమానం 100 శాతం సురక్షితమైనదని వీఎస్ఆర్ సంస్థ చెబుతున్నది.
విమాన ప్రమాద సమయంలో నాలుగైదు పేలుడు శబ్ధాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విమానం కూలగానే పెద్దయెత్తున మంటలు వచ్చాయని, ప్రమాద తీవ్రతకు రెండు మృతదేహాలు బయటకు ఎగిరిపడ్డాయన్నారు. కళ్లద్దాలు, వాచీని చూసి అజిత్ పవార్‌ను గుర్తించి బయటకు లాగామని, అయితే అప్పటికే నష్టం జరిగిపోయిందని ఓ ప్రత్యక్ష సాక్షి కన్నీటిపర్యంతమయ్యారు.