ముంబై: రుణమాఫీ కోరిన అన్నదాతపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చిందులు తొక్కారు. భూమ్-పరంద తాలూకాలోని ధారాశివ గ్రామంలో వరద బాధిత రైతులను పరామర్శించేందుకు ఆయన వెళ్లారు. ఓ రైతు ఆయనను ఉద్దేశించి మాట్లాడుతూ, “ప్రభుత్వం మాకు రుణ మాఫీని ప్రకటిస్తుందా?” అని ప్రశ్నించారు. అజిత్ పవార్ స్పందిస్తూ, “మాకు తెలియదనుకుంటున్నావా? మేం ఇక్కడ ఉన్నది గోళీలు ఆడుకోవడానికా?” అని అన్నారు.
“ఈయనని సీఎంని చెయ్యండి” అని వ్యంగ్యంగా అన్నారు. “నేను ఉదయం 6 గంటల నుంచి పని చేస్తున్నాను. పని చేసేవాళ్ల గొంతును నొక్కేయాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు” అన్నారు. ఏం జరుగుతున్నదీ తమకు తెలుసునని, లడకీ బహిన్ పథకం కింద రూ.45,000 కోట్లు ఇస్తున్నామని, రైతుల విద్యుత్తు ఛార్జీలను రద్దు చేశామని, తామే ఆ బిల్లులను చెల్లిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు స్పందిస్తూ అజిత్ పవార్ అహంకారపూరితంగా మాట్లాడారని దుయ్యబట్టాయి.