ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) అసంతృప్తికి గురయ్యారు. కీలక ఒప్పందం కార్యక్రమానికి ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఏక్నాథ్ షిండేతో ఫోన్లో మాట్లాడారు. మైత్రి ధర్మానికి కట్టుబడి ఉండాలని కోరారు. మహారాష్ట్రలో కార్ల తయారీ ప్రాజెక్ట్ కోసం టయోటా కిర్లోస్కర్తో ఎంఓయూ కుదుర్చుకునే కార్యక్రమం గురువారం జరిగింది. అయితే డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఆయన వర్గం ఎన్సీపీకి చెందిన పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సమంత్కు ఆహ్వానం అందలేదు.
కాగా, అజిత్ పవార్, ఉదయ్ సమంత్ కలిసి పరిశ్రమల శాఖకు సంబంధించిన సమస్యలను సమీక్షించే సమావేశంలో పాల్గొన్నారు. పరిశ్రమల శాఖ, మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఐడీసీ)కు చెందిన చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. మిగతా అధికారులను ఆరా తీయగా టయోటా కిర్లోస్కర్తో ఎంఓయూ ఈవెంట్ కోసం వారు వెళ్లినట్లు తెలిసింది.
మరోవైపు ఆ కార్యక్రమానికి తనతోపాటు పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సమంత్ను ఆహ్వానించని సంగతి తెలిసి అజిత్ పవార్ షాక్ అయ్యారు. వెంటనే సీఎం ఏక్నాథ్ షిండేతో ఫోన్లో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో తాము కూడా భాగమన్న ఆయన మైత్రి ధర్మానికి కట్టుబడి ఉండాలని అన్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ వచ్చే వరకు కార్యక్రమాన్ని కొనసాగిస్తామని సీఎం షిండే తెలిపారు. దీంతో అజిత్ పవార్, ఉదయ్ కలిసి ఎంఓయూ కుదుర్చుకునే రాష్ట్ర అతిథి గృహమైన సహ్యాద్రికి చేరుకుని ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.