Sushant Singh Rajput | బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి మూడేండ్లు అవుతున్నా ఇంకా సందిగ్ధత వీడటం లేదు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆధారాలు ఉన్నప్పటికీ.. లేదు ఆయన మరణం వెనుక ఏదో కుట్ర జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాలు కాదు.. ఇదే నిజమని చాలామంది నమ్ముతున్నారు. దీంతో సుశాంత్ మరణంపై సీబీఐ విచారణ చేపట్టింది. మూడేండ్లు అయినా సీబీఐ దర్యాప్తులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల విచారణలో పలు కీలక సాక్ష్యాలను సేకరించినట్లుగా తెలిపారు.
‘ సుశాంత్ కేసులో తమ వద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నాయని కొంతమంది చెప్పారు. వాళ్లను సంప్రదించి తమ దగ్గర ఉన్న సాక్ష్యాలను పోలీసులకు ఇవ్వాలని కోరాం’ అని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. వారి దగ్గర నుంచి ప్రాథమిక ఆధారాలు సేకరించామని చెప్పారు. అయితే సాక్ష్యులు చెప్పిన విషయాల్లోని నిజానిజాలను అధికారులు విశ్లేషిస్తున్నారని తెలిపారు. సుశాంత్ మరణంపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని.. ఈ దశలో ఈ కేసు గురించి ఇంకా ఏమీ చెప్పలేమని వెల్లడించారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020 జూన్ 14వ తేదీన ముంబైలోని తన అపార్ట్మెంట్లో విగతజీవిగా కనిపించాడు. తొలుత సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఆయన మరణంపై కుటుంబసభ్యులతో పాటు పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. సుశాంత్ మరణం వెనుక ఏదో కుట్ర ఉందని ఆరోపించారు. అయితే సుశాంత్ మరణానికి బాలీవుడ్లో నెపోటిజమే కారణమని పలువురు సినీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్నుంచి బైకాట్బాలీవుడ్ అని పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. బాలీవుడ్ స్టార్ హీరోలు, వాళ్ల వారసుల సినిమాలను బహిష్కరించారు. వాళ్ల సినిమాలు విడుదలకు సిద్ధమైన ప్రతిసారి #boycottbollywood అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్లో పెద్ద ఎత్తున ఉద్యమమే చేశారు.