Devendra Fadnavis | ముంబై, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు దాదాపు ఖరారైంది. ఉపముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ నియమితులు కానున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ఈ నెల 5న సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పా ట్లు ప్రారంభమయ్యాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఎ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు 40 వేల మంది కార్యకర్తలు, నేతలు కూడా హాజరుకానున్నారు. ఇందులో 10 వేల మంది కార్యకర్తలు ఏక్ హైతో సేఫ్ హై అనే సందేశంతో కూడిన టీ-షర్టులు ధరించనున్నారు.