Maharastra : ఆరోగ్య (Health), విపత్తు నిర్వహణ (Disaster Management) సహా పలు కీలక శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సెలవులను మహారాష్ట్ర ప్రభుత్వం (Maharastra Government) రద్దు చేసింది. భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మహా సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన చేసింది. శత్రువుకు లాభం చేకూరేలా ఎవరైనా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆ ప్రకటనలో హెచ్చరించింది.
రాష్ట్రంలో భద్రతా పరిస్థితులపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంవోలో ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే కీలక శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సెలవుల రద్దు నిర్ణయం తీసుకున్నారు. సీఎం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మహారాష్ట్ర డీజేపీ, ముంబై పోలీస్ కమిషనర్, హోంశాఖ ఉన్నతాధికారులు, వివిధ శాఖల, ఏజెన్సీల సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని 36 జిల్లాల్లో యుద్ధ సన్నద్ధత కోసం మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఈ సమావేశంలో సీఎం ఫడ్నవీస్ సూచించారు. హాస్పిటల్స్లో కోఆర్డినేషన్ మిషనరీని సెటప్ చేయాలని చెప్పారు. ఇళ్లలో లైట్లు బయటికి కనిపించకుండా మందపాటి కర్టెన్లను వినియోగించాలని ఆదేశించారు.