ముంబై: ఈ రోజుల్లో దొంగతనాలు సాధారణమయ్యాయి. అయితే ఇలా దొంగలు కొట్టేసిన సొమ్ము రికవరీ అవడం అత్యంత అరుదుగా జరుగుతుంది. కానీ అందుకు భిన్నంగా మహారాష్ట్రలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఓ కుటుంబం 24 ఏండ్ల క్రితం పోగొట్టుకున్న బంగారం ఇన్నాళ్లకు తిరిగి వాళ్ల చేతికి అందింది. వాళ్లు పోగొట్టుకున్నది రూ.13.45 లక్షల విలువచేసే బంగారం, కానీ చేతికొచ్చింది మాత్రం రూ.1.5 కోట్ల విలువచేసే బంగారం..!
ఆశ్యర్యంగా ఉంది కదా..! అదెలాగో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. 1998లో ముంబైలో కొలాబా రెసిడెంట్లోని అర్జున్ దస్వానీ అనే వ్యాపారి ఇంట్లో దొంగతనం జరిగింది. రూ.13.45 లక్షల విలువచేసే బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. అప్పట్లో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి చోరీకి గురైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అయితే, కేసులో మరో ఇద్దరు దొంగలు పరారీలో ఉండటంతో వారి కోసం గాలింపు చేపట్టారు. కానీ ఆ దొంగలు ఏండ్లు గడిచినా దొరకలేదు. దాంతో కేసు క్లోజ్ కానందున బంగారాన్ని అర్జున్ దస్వానీ కుటుంబానికి ఇవ్వలేదు. 2007లో అర్జున్ దస్వానీ అనారోగ్యంతో మరణించాడు. ఇక అతని కుటుంబం కూడా పోయిన బంగారంపై ఆశలు వదులుకున్నది.
కానీ, గత ఏడాది ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు బంగారాన్ని దాని యజమానికి అప్పగించేందుకు అనుమతించాలని కోర్టులో దరఖాస్తు పెట్టుకున్నారు. కేసు పూర్వపరాలు తెలుసుకున్న న్యాయస్థానం ఇటీవల ఆ బంగారాన్ని యజమానికి తిరిగిచ్చేందుకు అంగీకరించింది. దాంతో ముంబై పోలీసులు రూ.1.5 కోట్ల విలువచేసే బంగారాన్ని అర్జున్ దస్వానీ కుటుంబసభ్యులకు అప్పగించారు.
Maharashtra | A Colaba resident gets back stolen gold worth crores, after 24 years
— ANI (@ANI) January 31, 2022
"Recovery of 2 antique gold coins, 3 gold bracelets, & 2 ingots, were made & given to the Arjan Daswani family by the Colaba Police, after its robbery in 1998," said Colaba ACP, Pandurang Shinde pic.twitter.com/WeAIRGdg5T