ముంబై, (నమస్తే తెలంగాణ) : మహారాష్ట్రలో ఓ బీజేపీ ఎమ్మెల్యే ఏకంగా పోలీస్ స్టేషన్లోనే తుపాకీ కాల్పలకు తెగబడ్డారు. శివసేన(షిండే వర్గం)కు చెందిన మాజీ కార్పొరేటర్ మహేశ్ గైక్వాడ్, ఆయన అనుచరులను చంపేందుకు థానె జిల్లా కల్యాణ్ (తూర్పు) నియోజికవర్గ బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ ప్రయత్నించారు. ఎస్ఐ ఛాంబర్లో ఆరు రౌండ్లపాటు తుపాకీ కాల్పులు జరిపారు.
శుక్రవారం సాయంత్రం ఉల్హాస్‌నగర్‌లోని హిల్‌లైన్ పోలీస్‌స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ కెమెరా ఫుటేజ్ బయటకు విడుదలైంది. ఈ ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్‌ను, మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిపై హత్యానేరం సహా ఇతర నేరాల కింద కేసులు నమోదు చేశారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ మహేశ్ గైక్వాడ్ దవాఖానలో వైద్య చికిత్స పొందుతున్నారు.