Mahakumbh : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం (Uttarpradesh state) లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj) లో జరుగుతున్న మహా కుంభమేళా (Mahakumbh) యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంగా అందరి మన్ననలు పొందుతున్నది. నిత్యం కోట్లాది భక్తులు ఈ మహా కుంభమేళాకు తరలివస్తున్నారు. సాధారణంగా జనం ఎక్కువగా ఉన్న చోట ఆక్సిజన్ సరిగా అందదు. అందుకే ఊపిరాడక చాలామంది అసౌకర్యానికి గురవుతుంటారు.
కానీ, మహా కుంభమేళాకు కోట్లమంది భక్తులు పోటెత్తుతున్నా ప్రయాగ్‌రాజ్‌లో స్వచ్ఛమైన గాలికి మాత్రం కొదువ ఉండటం లేదు. దాంతో పర్యావరణపరంగా కూడా ఈ పుణ్య నగరి శభాష్ అనిపించుకుంటోంది. మరి కోటానుకోట్ల మంది భక్తులు తరలివచ్చినా అక్కడ స్వచ్ఛమైన గాలి ఎలా సాధ్యమవుతోంది..? అందుకు యూపీ సర్కారు ఏం చేసింది..? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మహాకుంభ మేళా ఈ ఏడాది జనవరి 13న ప్రారంభమైంది. దానికి రెండేళ్ల ముందే యూపీ ప్రభుత్వం ప్రభుత్వం భక్తులకు ఆక్సిజన్ కొరత లేకుండా చూడటం కోసం కసరత్తు చేసింది. అందులో భాగంగా ప్రయాగ్‌రాజ్ మున్సిపల్ కార్పొరేషన్లో మియవాకి అనే జపనీస్ పద్ధతిని ఉపయోగించి ఓ చిట్టడవిని తయారు చేసింది. కార్పోరేషన్‌లోని 10 ప్రదేశాల్లో 18.50 ఎకరాల భూమిలో 5 లక్షలకుపైగా మొక్కలను నాటింది. ఈ మొక్కలు చెట్లుగా ఎదిగి ఇప్పుడు రోజూ సుమారుగా 11.5 కోట్ల లీటర్ల ఆక్సిజన్‌ను వాతావరణంలోకి వదులుతున్నాయి.
ప్రస్తుతం అక్కడ ఒక్కో చెట్టు దాదాపు 25 నుంచి 30 అడుగుల ఎత్తుదాకా పెరిగాయి. ఒక్కో చెట్టు నుంచి రోజూ సగటున 230 లీటర్ల ఆక్సిజన్ విడుదలవుతుంది. ఈ మియవాకి మెథడ్‌తో చెట్లను పెంచడానికి ప్రయాగ్‌రాజ్ మున్సిపల్ కార్పోరేషన్ రూ.6 కోట్లను ఖర్చు చేసింది. ప్రాజెక్టులో భాగంగా మొత్తం 63 రకాల మొక్కలను నాటారు. ఈ 63 రకాల్లో మర్రి, రావి, వేప, మహువా, మామిడి, చింత, తులసి, తామర, కదంబ, బ్రాహ్మి, ఉసిరి, రేగి, వెదురు, నిమ్మ, మునగ లాంటివి ఉన్నాయి. పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలు, అలంకార మొక్కలన్నీ ఆ చిట్టడవిలో ఉండటం విశేషంగా చెప్పవచ్చు.
ఈ చిట్టడవి నిర్వహణ కాంట్రాక్టును మూడేళ్ల వ్యవధి కోసం ఒక కంపెనీకి అప్పగించారు. ప్రయాగ్‌రాజ్ పరిధిలోని ట్రాన్స్పోర్ట్ నగర్ పార్క్, బాలూ మండి, అవంతిక కాలనీ, దేవఘాట్ పార్క్, ట్రాన్స్పోర్ట్ నగర్ పార్క్-2 తదితర ఏరియాల్లో ప్రభుత్వం పెంచిన చిట్టడవి విస్తరించి ఉన్నది.
Saif Ali Khan case | ‘నా కొడుకును అక్రమంగా ఇరికించారు..’ భారత మీడియా సంస్థతో సెహజాద్ తండ్రి
Crime news | రాత్రంతా పరిచయస్తుడితో బయటికి.. తెల్లారి ఇంట్లో వాళ్లు తిడతారని..!
Crime news | అమానవీయం.. అప్పు చెల్లించలేదని మహిళను తీవ్రంగా కొట్టి.. గుండు గీసి..!