పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Elections) తొలి విడత ఎన్నికల సమయం సమీపిస్తున్నప్పటికీ విపక్ష మహాఘట్బంధన్లో (Mahaghatbandhan) సీట్ల లొల్లి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నదనే స్పష్టత రానప్పటికీ.. ముఖ్యమంత్రి అభ్యర్థిపై (CM Face) కూటమి పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. ఆర్జేడీ (RJD) ముఖ్య నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌పై (Tejaswi Yadav) పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయని, ఆయన సారథ్యంలోనే ఎన్నికల్లో పోటీచేసేందుకు ముందుకు వెళ్లాలని నిర్ణయించాయని సమాచారం. తేజస్వీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నేడో రేపో ప్రకటించే అవకాశం ఉందని ఆర్జేడీ వర్గాలు వెల్లడించాయి. ఇకపై మహాఘట్బంధన్లోని అన్ని రాజకీయ పక్షాలు ‘లెట్స్ గో బీహార్, లెట్స్ చేంజ్ బీహార్’ నినాదాన్ని వినిపించనున్నాయని తెలిపాయి. ఇదే విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ అఖిలేష్ ప్రసాద్ సింగ్ గత శుక్రవారం ధ్రువీకరించిన విషయం తెలిసిందే.
కాగా, కూటమిలో నెలకొన్న గందగోలాన్ని నివారించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగింది. రాజస్థాన్ మాజీ సీఎం, సీనియర్ నేత అశోక్ గెహ్లాట్‌ను పాట్నాకు పంపించింది. ఆయన తేజస్వీతో బుధవారం రాత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మహాఘట్బంధన్లోని పార్టీల సీట్ల వ్యవహారంపై చర్చించినట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా 243 స్థానాల్లో 5 నుంచి 10 స్థానాల్లో మిత్రపూర్వక పోటీ పెద్ద విషయమేమీ కాదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే బీహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.