థానే: మహిళలపై లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేయడం కోసం నిర్భయ, దిశ లాంటి ఎన్ని కఠిన చట్టాలు చేసినా కొందరు పోకిరీలు మాత్రం తమ బుద్ధి మార్చుకోవడం లేదు. నిత్యం పలుచోట్ల లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలోని థానే జిల్లా కొప్రి ఏరియాలో కూడా అలాంటి ఘటనే జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గత కొన్ని రోజులుగా ఓ 30 ఏండ్ల వ్యక్తి స్థానిక యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. బుధవారం తెల్లవారుజామున కూడా యువతిని వేధించడంతో ఆమె తండ్రి గట్టిగా మందలించాడు.
దాంతో సదరు వ్యక్తి యువతి తండ్రిపై చేయిచేసుకున్నాడు. ఇది గమినించిన ఇరుగుపొరుగు నిందితుడిని బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసిన తీసుకెళ్లారు. స్టేషన్లో నిందితుడు యువతిని, ఆమె తండ్రిని, స్టేషన్కు తీసుకెళ్లిన పోలీసులను దుర్భాషలాడుతుండటంతో ఎస్ఐ నిలువరించే ప్రయత్నం చేశాడు. దాంతో నిందితుడు ఎస్ఐని కూడా ఛాతిపై చెయ్యిపెట్టి తోసేశాడు. ఈ ఘటనలో కిందపడిన ఎస్ఐ చేతికి గాయం కావడంతో ఆస్పత్రికి తరలించారు.
కాగా, నిందితుడిపై లైంగిక దాడి, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై భౌతిక దాడి ఆరోపణలతో కేసులు నమోదు చేశారు.