Maha Kumbh | మహాకుంభ్‌నగర్, జనవరి 29 : మహాకుంభమేళాలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం ఘాట్ వద్ద భక్తుల మధ్య తొక్కిసలాట చోటుచేసుకున్నది. పవిత్ర మౌని అమావాస్య నాడు స్నానమాచరించాలనే భక్తుల తాపత్రయం, రద్దీని అదుపు చేయడంలో యంత్రాంగం వైఫల్యం కారణంగా మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ విషాద ఘటనలో దాదాపు 30 మంది మరణించగా, మరో 60 మంది వరకు గాయపడ్డారు. తొక్కిసలాట కారణంగా కొంతసేపు సంగమం ఘాట్ వద్ద పవిత్రస్నానాలకు ఆటంకం ఏర్పడింది.
కుంభమేళ జరిగే రోజుల్లో మౌని అమావాస్యను భక్తులు పవిత్రంగా భావిస్తారు. అమావాస్య బ్రహ్మ ముహూర్తంలో పవిత్ర స్నానమాచరించడం పుణ్యమనే నమ్మకం ఉంది. ఇందులోనూ త్రివేణి సంగమం ఘాట్ వద్ద స్నానాలు చేసేందుకు ఎక్కువ మంది భక్తులు వచ్చారు. ఈ ఘాట్‌కు కిలోమీటరు దూరంలో, అఖాడాలు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన దారి వద్ద రద్దీ అదుపు తప్పి తొక్కిసలాట జరిగింది. భక్తులు బారికేడ్లు విరగ్గొట్టడం, వాటి పైనుంచి దూకడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్టు డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. 90 మందిని దవాఖానకు తరలించగా, వీరిలో 30 మంది మరణించినట్టు చెప్పారు.
తొక్కిసలాట ఘటనతో సంగమం ఘాట్ వద్ద స్నానాలకు కొంత సేపు ఆటంకం ఏర్పడింది. అమృత ఘడియల్లో అఖాడాలు పుణ్యస్నానం చేయాల్సి ఉండగా, ఘటన కారణంగా వాయిదా వేసుకోవాలని సీఎం యోగి కోరారు. దీంతో మధ్యాహ్నం అఖాడాలు స్నానమాచరించారు. ఘటనకు కారణాలు తెలుసుకునేందుకు జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు యోగి తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌లో పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ, ఒత్తిడి మాత్రం కొనసాగుతున్నదని ఆయన పేర్కొన్నారు. బుధవారం 9-10 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌లో ఉన్నారని ప్రకటించారు.
తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కేంద్రం, యూపీ ప్రభుత్వంపై విపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వ యంత్రాంగం కేవలం వీఐపీలపైనే ధ్యాస పెట్టడం, నిర్వహణ వైఫల్యం వల్లే ఘటన జరిగిందని ధ్వజమెత్తాయి. దుర్ఘటనపై యూపీ మంత్రి సంజయ్ నిషాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఇలాంటి పెద్ద కార్యక్రమాల్లో, ఎక్కువ మంది జనం వచ్చిన దగ్గర చిన్న చిన్న సంఘటనలు జరుగుతూనే ఉంటాయి.’ అని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): కుంభమేళాలో భక్తుల మరణాల పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. మహా కుంభ మేళాలో పవిత్రస్నానాలు ఆచరిస్తున్న భక్తులు తొకిసలాటలో మరణించడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగి 30 మంది మరణించటం పట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో క్షతగాత్రులైనవారికి వైద్యసేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : మహాకుంభమేళాలో తొకిసలాట ఘటన కలిచివేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆప్తులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు.