Maha Kumbh | మహా కుంభమేళా ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 26న శివరాత్రితో ముగియనున్నది. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్ చేరుకుంటున్నారు. ఇప్పటికే 50కోట్ల మందికిపైగా భక్తులు త్రివేణీ సంగమంలో స్నానాలు ఆచరించారు. మహా కుంభమేళా ముగింపునకు రైళ్లు, బస్సులు, ప్రత్యేక వాహనాల ద్వారా పెద్ద సంఖ్యలో జనం ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు. అదే సమయంలో విమాన మార్గంలోనూ పెద్ద సంఖ్యలోనే భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్ వెళ్లే విమానాల్లో టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా ధరలు మరింత పెరుగుతున్నాయి. అదే సమయంలో విమానాల రాకపోకల సంఖ్య సైతం భారీగానే పెరిగింది. మహా కుంభమేళా సమయంలో ఢిల్లీ నుంచి రూ.13వేలకు తక్కువ కాకుండా ధర ఉండగా.. కొన్ని తేదీల్లో రూ.20వేలకుపైగా ధర పలికింది. గత రెండురోజులుగా ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయం నుంచి నడిచే విమానాల సంఖ్య వంద మార్క్‌ను దాటింది.
అయినప్పటికీ చాలా నగరాల నుంచి నేరుగా విమాన సర్వీసులు నడుస్తుండగా.. ధరలు ఏమాత్రం దగ్గడం లేదు. చార్జీలు సైతం అధికంగా ఉన్నా.. సీట్లు మాత్రం దొరకడం లేదు. మంగళవారం (ఫిబ్రవరి 18) రోజున ప్రయాగ్‌రాజ్ నుంచి బెంగళూరు ప్రయాణానికి ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్ కంపెనీ ఒక్కొక్కరికి రూ.39,146 వసూలు చేస్తున్నది. కుంభమేళా సమయంలో బెంగళూరుకు రూ.22వేల వరకు వసూలు చేస్తుండేవారు. తాజాగా కంపెనీలు భారీగా పెంచేశాయి. ఇక ముంబయికి వెళ్లే విమానాల్లో టికెట్ల ధర ఇదే పరిస్థితి ఉన్నది. మంగళవారం ప్రయాగ్‌రాజ్ నుంచి ముంబయికి ఏడు విమానాలు నడుస్తుండగా.. రూ.20వేలకుపైగా వసూలు చేస్తున్నాయి. సోమవారం కనీసం రూ.21,974 వసూలు చేశాయి. ఇక మహారాష్ట్రలోని పుణేకు సైతం విమాన చార్జీలు రూ.20వేలకు తక్కువగా లేవు. హైదరాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు రూ.28వేల నుంచి రూ.32వేలు, ప్రయాగ్‌రాజ్ నుంచి హైదరాబాద్‌కు రూ.33వేల వరకు ధర పలుకుతున్నది.
అలాగే, కోల్‌కతా, భువనేశ్వర్ తదితర ప్రాంతాలకు నడిచే విమానాల్లోనూ టికెట్ల ధరలు ఇదే తరహాలు ఉన్నాయి. విమానయాన సంస్థలు ప్రయాణికుల నుంచి భారీగానే దండుకుంటున్నాయి. విశేషమేంటంటే.. స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా తదితర విమానయాన సంస్థలు ఫిబ్రవరి 28 వరకు విమానాలను నడిపేందుకు షెడ్యూల్ చేశాయి. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్ నుంచి జైపూర్, గౌహతి, కోల్‌కతా, భువనేశ్వర్, ఢిల్లీ, డెహ్రాడూన్, రాయ్‌పూర్, బిలాస్పూర్, పుణే, ముంబయి, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, హైదరాబాద్, చండీగఢ్, లక్నోకు నేరుగా విమానాలు నడుస్తున్నాయి. తాజాగా ఇండిగో ఎయిర్‌లైన్ కంపెనీ ప్రయాగ్‌రాజ్ నుంచి పుణేకు నేరుగా విమానాన్ని ప్రారంభించింది. ఈ విమానం 11.10 గంటలకు బయలుదేరి.. మధ్యాహ్నం 1.10 గంటలకు పుణే చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి.. సాయంత్రం 4.10 గంటలకు ప్రయాగ్‌రాజ్ చేరుతుంది. అదే సమయంలో ప్రయాగ్‌రాజ్ నుంచి రాంచీకి డైరెక్ట్ విమానం నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.