Maha Kumbh 2025 | జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ 45 రోజుల పాటు ప్రయాగ్ రాజ్ లో మహా కుంభ మేళా జరుగనున్నది. ఈ కుంభమేళాకు 40 కోట్లమంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ప్రయాగ్ రాజ్ లో జరిగే కుంభమేళాలో పాల్గొని అయోధ్యలోని రామ్ లల్లా ఆలయాన్ని కూడా భక్తులు సందర్శిస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆదివారం జరిగిన మన్ కీ బాత్’ కార్యక్రమంలో కూడా ప్రధాని నరేంద్రమోదీ మహా కుంభమేళాను ప్రస్తావిస్తూ.. ఇది ఐక్యతా మేళా అని పేర్కొన్నారు. ఆధ్యాత్మికత, సంస్కృతి, భద్రత, ఆధునికతల మేళవింపుగా ఈ కుంభమేళా నిర్వహించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ తెలిపింది.
భక్తుల భద్రత కోసం పారా మిలిటరీ బలగాలతోపాటు 50 వేల మంది సిబ్బందిని నియమించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తో కూడిన 2700 కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నారు. తొలిసారి అండర్ వాటర్ డ్రోన్లను వినియోగిస్తున్నారు. కుంభమేళా సమాచారం తెలుసుకోవడానికి 11 భారతీయ భాషల్లో ఏఐ చాట్ బోట్లు ఏర్పాటు చేశారు. భక్తులకు తాత్కాలిక వసతి కల్పనకు వేల సంఖ్యలో టెంట్లు, షెల్టర్లతో మహా కుంభ్ నగర్ నిర్మిస్తున్నారు. దీన్ని గూగుల్ మ్యాప్ తోనూ అనుసంధానిస్తారు. కుంభమేళాకు వచ్చిన భక్తులకు చికిత్స చేసేందుకు తాత్కాలిక దవాఖానలు కూడా ఏర్పాటు చేశారు. ఒకేసారి 200 మందికి చికిత్స అందించేందుకు వీలుగా బీష్మ క్యూబ్ ఏర్పాటు చేస్తున్నారు.
ఇక నేత్ర కుంభ్ శిబిరం ద్వారా ఐదు లక్షల మంది భక్తులకు కంటి పరీక్షలు నిర్వహించి మూడు లక్షలకు పైగా కండ్లద్దాలు పంపిణీకి చర్యలు చేపట్టారు. భక్తులు కుంభ మేళాలో ఆయా ప్రదేశాలకు వెళ్లేందుకు ఆంగ్లం, హిందీ, ప్రాంతీయ భాషల్లో 800 బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక 92 రోడ్లు పునర్నిర్మిస్తున్నారు. 17 ప్రధాన రహదారుల సుందరీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. అవాంఛనీయ ఘటనలు జరక్కుండా అత్యాధునిక బహుళ విపత్తు నివారణ వాహనాలను మోహరిస్తున్నారు. సౌర విద్యుత్ తో లైటింగ్ వసతులు కల్పిస్తున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించారు.