Maha Assembly: మరాఠా సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించేలా రూపొందించిన మరాఠా రిజర్వేషన్ బిల్లుకు ఇవాళ మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ బిల్లు చట్టంగా మారగానే మహారాష్ట్రలో మరాఠా సామాజికవర్గ ప్రజలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ సదుపాయం అందుబాటులోకి రానుంది.
ఏక్నాథ్ షిండే సర్కారు మరాఠాల అభివృద్ధి కోసం వారికి విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. ఆ మేరకు ఓ బిల్లును రూపొందించింది. ఆ బిల్లుకు ఇవాళ ఉదయం కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. వెంటనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి క్యాబినెట్ ఆమోదం పడిన ఆ బిల్లుకు అసెంబ్లీ కూడా ఆమోదముద్ర వేసింది.
కాగా, మరాఠా రిజర్వేషన్ బిల్లును మహా అసెంబ్లీలో ప్రవేశపెట్టడం గత దశాబ్ధ కాలంలో ఇది మూడోసారి. గతంలో రెండు సార్లు బిల్లు అసెంబ్లీ ముందుకు వెళ్లినా సభ ఆమోదం లభించలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ బిల్లుకు ఆమోదం తెలిపేందుకే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లు ఆమోదం పొందింది.
మహారాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎంబీసీసీ) చైర్మన్ గత శుక్రవారం ఇచ్చిన నివేదిక ఆ రాష్ట్రంలో మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మహారాష్ట్రలో ఇప్పటికే ఆర్థికంగా వెనుబడిన వర్గాల కోసం 10 శాతం రిజర్వేషన్ అమల్లో ఉన్నది. ఆ రిజర్వేషన్లలో కూడా మరాఠాలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నట్లు తెలుస్తున్నది.