Operation Sindoor | రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ఉత్తరాఖండ్ మదర్సా ఎడ్యుకేషనల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ముఫ్తీ షామూన్ ఖాస్మి మంగళవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యావేత్తలు, మేధావులు, సూఫీల ప్రతినిధి బృందం కలిసింది. ఆపరేషన్ సిందూర్ విజయవంతం చేసినందుకు రక్షణ మంత్రిని అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నాయకత్వంలో భారత దళాలు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలను భారీ దెబ్బకొట్టాయన్నారు. ఈ సాహసోపేతమైన చర్యతో భారతదేశ వ్యూహం, భద్రతా విధానాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసిస్తున్నారన్నారు.
ఆపరేషన్ సిందూర్‌లో అమరవీరులైన సైనికుల కుటుంబాలకు, జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ దాడిలో మరణించిన పర్యాటకుల కుటుంబాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని ఆయన రక్షణ మంత్రిని కోరారు. ఉత్తరాఖండ్ మదర్సా బోర్డు పాఠ్యాంశాల్లో ఆపరేషన్ సిందూర్‌ను చేర్చాలని ఆలోచిస్తున్నట్లు ముఫ్తీ ఖాస్మీ తెలిపారు. దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటంటే.. మదర్సాల్లో చదువుతున్న విద్యార్థులు దేశ సైనిక విజయాలు, జాతీయ భద్రత గురించి కూడా తెలుసుకోవచ్చునన్నారు.