చెన్నై, జూన్ 11: విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద రాష్ర్టాలకు కేంద్రం విడుదల చేసే నిధులను జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)తో ముడిపెట్టవలసిన అవసరం లేదని మద్రాస్ హైకోర్టు రూలింగ్ ఇచ్చింది. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం తమిళనాడుకు నిధులు విడుదల చేయటం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని, దీనిని జాతీయ విద్యా విధానం అమలుతో ముడిపెట్టవద్దని స్పష్టం చేసింది.
ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలలకు నిధులు విడుదల చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని తేల్చి చెప్పింది. కేంద్రం నుంచి నిధులు రాలేదన్న వంకతో ఈ బాధ్యత నుంచి రాష్ర్టాలు తప్పించుకోజాలవని కోర్టు స్పష్టం చేసింది. 2025-26లో ఆర్టీఈ కింద అడ్మిషన్లు ప్రారంభించే విధంగా తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కోయంబత్తూరుకు చెందిన హక్కుల కార్యకర్త వీ ఈశ్వరన్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ జీఆర్ స్వామినాథన్, జస్టిస్ వీ లక్ష్మీనారాయణన్తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.
చట్టం అమలు కోసం నిధులు విడుదల చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకకాలంలో బాధ్యత వహించాలని పేర్కొంది. సెక్షన్ 7(3) ప్రకారం, కేంద్రం రాష్ర్టాలతో సంప్రదించి ఆర్టీఈ చట్టం అమలుకు అయిన వ్యయంలో నిర్దిష్ట శాతాన్ని ఎప్పటికప్పుడు అందించడం తప్పనిసరి అని గుర్తుచేసింది.