చెన్నై: రోడ్డుపక్కన ఉన్న ప్రతీ రాయి విగ్రహం కాదు. ఈ కాలంలోనూ సమాజంలో మూఢ నమ్మకాలు ఉండటం విచారకరం.. అంటూ ఓ కేసు విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తన స్థలానికి ఎదురుగా రాయిని పెట్టి.. విగ్రహంగా పూజిస్తున్నారని, రాయిని తొలగించబోతే తనను అడ్డుకున్నారని కోర్టులో ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై హైకోర్టు పై విధంగా తీర్పు ఇచ్చింది. వారంలోగా ఆ రాయిని అక్కడ్నుంచి తొలగించాలని పల్లవరం రేంజ్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ‘దేశంలో మూఢ నమ్మకాలు ఇప్పటికీ ఉన్నాయి. కాలానుగుణంగా సమాజంలో, ప్రజల్లో మార్పు రాకపోవటం దురదృష్టకరం’ అని న్యాయమూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.