రెండో స్థానంలో యూపీ, తర్వాత ఛత్తీస్గఢ్
బీజేపీ, కాంగ్రెస్ రాష్ర్టాల్లోనే ఎక్కువ శిశు మరణాలు
న్యూఢిల్లీ, జూన్ 4: బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లోనే అత్యధిక శిశుమరణాలు సంభవిస్తున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ ఈ విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. ఆ రాష్ట్రంలో ప్రతీ వెయ్యి మంది నవజాత శిశువుల్లో 43 మంది మృత్యుఒడిలోకి చేరుకొంటున్నారు. మిజోరంలో అతి తక్కువ శిశుమరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ రాష్ట్రంలో ప్రతి వెయ్యిమంది శిశువులకు ముగ్గురు మరణిస్తున్నారు.
మొత్తంగా ఏడాది నిండకుండానే దేశంలో ప్రతి 36 పసికందుల్లో ఒకరు కన్నుమూస్తున్నారు. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా.. శిశు మరణాల రేటు (ఐఎంఆర్), 2020 నివేదికలో వెల్లడించింది.
దేశంలో సగటున 28 మంది
దేశవ్యాప్తంగా ప్రతి వెయ్యి మంది శిశువుల్లో సగటున 28 మంది కన్నుమూస్తున్నారు. 50 ఏండ్ల క్రితం అంటే 1971తో పోలిస్తే, (అప్పుడు ప్రతి వెయ్యి మందికి 129 శిశు మరణాలు) ప్రస్తుతం శిశు మరణాల రేటు తగ్గినప్పటికీ, మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉన్నదని నివేదిక సూచించింది. గడిచిన పదేండ్లలో శిశు మరణాల రేటు పట్టణాల్లో 35 శాతం, గ్రామాల్లో 34 శాతం తగ్గినట్టు వెల్లడించింది.