ఆయనో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు. మహా అయితే అవసరాల నిమిత్తం ట్యూషన్లు చెప్పుకుంటూ డబ్బులు ఆర్జిస్తారంటే పర్లేదు. అందులో పెద్ద అవాక్కయ్యే ముచ్చేటే లేదు. కానీ.. అలా కాదు.. మధ్యప్రదేశ్లో ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఒక ప్రాథమిక ఉపాధ్యాయుడే… 20 కాలేజీలకు యజమాని. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈయన సంపాదనను చూసి అధికారులే పరేషాన్ అయిపోయారు.
ప్రశాంత్ పార్మర్… మధ్యప్రదేశ్లోని ఘాటిగావ్లో ఉంటారు. స్థానికంగా ఉండే ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు. ఓ సాధారణ ఉపాధ్యాయుడు వేల కోట్లు సంపాదించుకున్నారని, 20 కాలేజీలు కూడా ఉన్నాయని ఆర్థిక నేర విభాగం వారికి ఎవరో చేరవేశారు. వెంటనే అధికారులు రంగంలోకి దిగి, వారి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆయన ఆస్తులు చూసి నివ్వెరపోయారు.
మధ్యప్రదేశ్లోని చంబల్తో సహా మరిన్ని ప్రాంతాల్లో ఈయనకు బీఈడీ కాలేజీలతో పాటు ఇతర కాలేజీలు ఓ 20 ఉన్నాయని అధికారులు లెక్క తేల్చారు. అంతేకాదు.. 3 నర్సింగ్ కాలేజీలు, ఇతర ఆఫీసులు కూడా ఉన్నాయట. వీటికి సంబంధించిన పత్రాలన్నింటినీ ఆర్థిక నేర విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రశాంత్ పార్మర్ 2006 లో ఉద్యోగంలో చేరారు. అప్పుడు ఆయన జీతం 3,500 మాత్రమే. ఇప్పుడు మాత్రం కోట్లకు చేరింది.