భోపాల్: యూట్యూబ్ జర్నలిస్టుతో పాటు మరో ఏడుగురిని పోలీస్స్టేషన్లో అర్ధనగ్నంగా నిల్చోబెట్టిన ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకొన్నది. సిధి జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే కేదార్నాథ్ శుక్లాకు వ్యతిరేకంగా నిరసన చేపట్టినందుకే పోలీసులు అత్యుత్సాహంతో ప్రవర్తించారని తెలుస్తున్నది. కేదార్నాథ్, ఆయన కుమారుడు గురుదత్పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారన్న నెపంతో నీరజ్ కుందర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దీన్ని నిరసిస్తూ, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కొందరు యువకులు నిరసన చేపట్టారు.
ఆ ఘటనను కవర్ చేసేందుకు స్థానిక జర్నలిస్టు, యూట్యూబర్ కనిష్క తివారీ తన కెమెరామ్యాన్తో కలిసి అక్కడికి వెళ్లారు. జర్నలిస్టుతో సహా నిరసన చేపట్టినవారిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వారిని పోలీస్ స్టేషన్లో బట్టలు విప్పించి, అర్ధనగ్నంగా నిల్చోబెట్టారు. ఈ ఘటన ఈ నెల 2న జరిగ్గా, దానికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో స్పందించిన ఆ రాష్ట్ర సీఎం.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.