Samosa | ఫోన్ పే పనిచేయడం లేదని చెప్పినా వినిపించుకోకుండా ప్రయాణికుడిపై దాడి చేసిన సమోసా విక్రేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ రైల్వే స్టేషన్లో శుక్రవారం జరిగిన ఈ ఘటన సోషల్‌మీడియాలో వీడియో వైరల్ కావడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ రైల్వే స్టేషన్లో శుక్రవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఓ ప్రయాణికుడు సమోసా కొనుగోలు చేశాడు. అయితే ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నించగా.. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యింది. ఇంతలో తాను వెళ్లాల్సిన రైలు బయల్దేరడంతో.. ఆ ప్రయాణికుడు సమోసాను తిరిగి ఇచ్చేశాడు. ట్రాన్సాక్షన్ అవ్వట్లేదని.. సమోసా తీసుకోమని చెప్పి రైలు ఎక్కేందుకు యత్నించాడు. దీంతో ఆగ్రహించిన సమోసాల విక్రేత ప్రయాణికుడిపై దాడికి దిగాడు.
ప్రయాణికుడి కాలర్‌ను పట్టుకుని దారుణంగా లాక్కొని వెళ్లాడు. డబ్బులు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. ఫోన్ పే ట్రాన్సాక్షన్ అవ్వడం లేదని కస్టమర్ ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు. చివరకు చేసేదేమీ లేక సదరు ప్రయాణికుడు తన దగ్గర ఉన్న స్మార్ట్ వాచ్‌ను సమోసా విక్రేతకు ఇచ్చాడు. అప్పుడు విక్రేత రెండు సమోసాలు ఇచ్చి, రైలు ఎక్కనిచ్చాడు. ఇదంతా అక్కడే ఉన్న ప్రయాణికులు వీడియో తీశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. సదరు రైల్వే వ్యాపారిపై కేసు నమోదు చేశారు.