Prahlad Singh Patel | రాజ్‌గఢ్: ప్రభుత్వాన్ని యాచించడం ప్రజలకు అలవాటైపోయిందని బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యాచించడం మాని, దేశం కోసం తమ జీవితాలను త్యాగాలు చేసిన మహనీయుల చరిత్ర గురించి తెలుసుకోవాలని అన్నారు. రాజ్‌గఢ్ జిల్లాలోని సుతాలియాలో శనివారం ఓ సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు ఉచిత పథకాలు ఇవ్వడం గురించి ప్రస్తావించారు.
ప్రజలకు సమాజం నుంచి తీసుకోవడం అలవాటైపోయిందని, ప్రస్తుతం వారు ప్రభుత్వాన్ని యాచించే స్థితికి కూడా దిగజారారని అన్నారు. దీంతో రాజకీయ నేత కనపడితే చాలు డిమాండ్ల లెటర్ చేతిలో పెట్టడం రివాజుగా మారిందన్నారు. ఇది మంచి అలవాటు ఎంతమాత్రం కాదని అన్నారు. ఎప్పుడూ తీసుకునే దానికి బదులుగా ఇచ్చే అలవాటును కూడా పెంచుకోవాలని పేర్కొన్నారు. బిచ్చగాళ్ల సైన్యాన్ని సమకూర్చడం వల్ల సమాజం ఎంతమాత్రం బలపడదని, పైగా చేటు తెస్తుందని అన్నారు.