భోపాల్: మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో వింత ఘటన జరిగింది. ఆస్పత్రి ఐసీయూలో కోమాలో ఉన్న వ్యక్తి.. అకస్మాత్తుగా బయటకు వచ్చి హంగామా చేశాడు. ఆ రాష్ట్రంలోని రత్ల్నాం పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. తన భర్త కోమాలో ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తనను తప్పుదోవ పట్టించాయని అతని భార్య ఆరోపించింది. చికిత్స కోసం అదనపు డబ్బు కావాలని డిమాండ్ చేసినట్లు పేర్కొన్నది. ఆస్పత్రిలోని ఐసీయూ నుంచి బయటకు వచ్చిన వ్యక్తికి చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది.
రత్ల్నాంలోని గీతా దేవి ఆస్పత్రిలో ఓ వ్యక్తిని అడ్మిట్ చేశారు. ఐసీయూలో ఉన్న అతని చికిత్స కోసం 50 వేలు డిమాండ్ చేశారు. తొలుత ఆ సొమ్ము డిపాజిట్ చేశానని అతని భార్య చెప్పింది. కొన్ని రోజులకు తన భర్త కండీషన్ మరింత దిగజారిందని ఆస్పత్రి వర్గాలు చెప్పాయని, అతను కోమాలోకి వెళ్లాడని, మరింత డబ్బు కావాలని ఆస్పత్రి డిమాండ్ చేసినట్లు ఆమె తెలిపింది.
లక్ష రూపాయలతో ఆ పేషెంట్ భార్య తిరిగి రాగానే.. ఆస్పత్రి బయట నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఐసీయూలో ఉన్న వ్యక్తి.. నడుచుకుంటూ బయటకు వచ్చి ఆస్పత్రి బయట ధర్నా చేశాడు. డబ్బు కోసం ఆస్పత్రి తనను ఐసీయూలో పెట్టిందని ఆ వ్యక్తి ఆరోపించాడు. కేవలం షార్ట్ మీదే బయటకు వచ్చిన అతను.. ముక్కుకు ట్యూబ్‌తో అలాగే రోడ్డుమీదకు వచ్చేశాడు. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో ఆస్పత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటన పట్ల దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.