భోపాల్: ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై ఒక ఐఏఎస్ అధికారి పలు ట్వీట్లు చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఆయనకు నోటీసులు పంపింది. మధ్యప్రదేశ్లో ఈ ఘటన జరిగింది. జమ్ముకశ్మీర్ నుంచి కశ్మీర్ పండిట్లను బలవంతంగా వెళ్లగొట్టిన వైనంపై తీసిన ‘కశ్మీర్ ఫైల్స్’ చిత్రంపై ఐఏఎస్ అధికారి నియాజ్ ఖాన్ ఇటీవల ట్విట్టర్లో స్పందించారు. వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కార్యదర్శి అయిన ఆయన ఈ మూవీని విమర్శిస్తూ పలు ట్వీట్లు చేశారు. పలు రాష్ట్రాల్లో హత్యకు గురైన ముస్లిం ప్రజల గురించి కూడా సినిమా తీయాలని ఆ నిర్మాతను డిమాండ్ చేశారు. దీని కోసం ముస్లింలపై నరమేధం గురించి తాను ఒక పుస్తకం రాస్తానని చెప్పారు.
మైనార్టీలైన ముస్లింలు కీటకాలు కాదని, ఈ దేశ పౌరులని నియాజ్ ఖాన్ అన్నారు. అలాగే ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా ద్వారా వచ్చిన డబ్బును కశ్మీర్ పండిట్లకు ఇళ్ల నిర్మాణం, వారి పిల్లలకు చదువు కోసం వినియోగించాలని ఆ సినీ నిర్మాతను డిమాండ్ చేశారు. కాగా, ఆయన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దీనిపై స్పందించారు. ఐఏఎస్ అధికారి నియాజ్ ఖాన్ ఆలోచల్ని షేర్ చేసుకునేందుకు ఆయన అపాయింట్మెంట్ కూడా కోరారు.
మరోవైపు ఐఏఎస్ అధికారి నియాజ్ ఖాన్ ట్వీట్లపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఆయన పోస్ట్ చేసిన వివాదస్పద ట్వీట్లపై వివరణ కోరుతూ నోటీసులు పంపింది. ఆ రాష్ట్ర హోంమంత్రి హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా దీని గురించి మీడియాతో బుధవారం మాట్లాడారు. ఖాన్ ట్వీట్లను తాను కూడా చూసినట్లు చెప్పారు. ఇది చాలా సీరియస్ అంశమన్నారు. ఆయన తన పరిధి దాటుతున్నారని, ప్రభుత్వ అధికార లక్ష్మణ రేఖను ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. షోకాజ్ నోటీస్ జారీ చేస్తామని చెప్పారు. కాగా, ఆ ఐఏఎస్ అధికారి మతవాదం గురించి మాట్లాడుతున్నారని ఆ రాష్ట్ర వైద్య విద్యా మంత్రి సారంగ్ ఆరోపించారు. దీనిపై పర్సనల్ విభాగానికి లేఖ రాస్తానని పేర్కొన్నారు.