మంగళవారం 07 ఏప్రిల్ 2020
National - Mar 16, 2020 , 18:16:17

రేపే బలపరీక్ష నిర్వహించాలని సీఎంకు గవర్నర్‌ లేఖ

రేపే బలపరీక్ష నిర్వహించాలని సీఎంకు గవర్నర్‌ లేఖ

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఈ నెల 17వ తేదీనే(మంగళవారం) అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సీఎం కమల్‌నాథ్‌కు గవర్నర్‌ లాల్జి టాండన్‌ లేఖ రాశారు. బలపరీక్ష నిర్వహించకపోతే మెజార్టీ లేదని భావిస్తామని గవర్నర్‌ తన లేఖలో పేర్కొన్నారు. 

ఇవాళ మధ్యప్రదేశ్ అసెంబ్లీలో సీఎం కమల్ నాథ్ ప్రభుత్వానికి విశ్వాస పరీక్ష జరగాల్సి ఉన్ననేపథ్యంలో సభ్యులంతా సభకు హాజరయ్యారు. అయితే కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన నేపథ్యంలో.. స్పీకర్ ప్రజాపతి  అసెంబ్లీని మార్చి 26 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సీఎం కమల్ నాథ్ ప్రభుత్వానికి జరుగనున్న విశ్వాస పరీక్ష వాయిదా పడింది. అంతకుముందు ప్రతిపక్ష నేత గోపాల్ భార్గవ్ మాట్లాడుతూ..విశ్వాస పరీక్ష నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చాలా మంది ఎమ్మెల్యేలు కమల్ నాథ్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయం. కమల్ నాథ్ ప్రభుత్వం నైతికంగా ఓడిపోయినట్లే లెక్క. సీఎం కమల్ నాథ్ తన పదవికి రాజీనామా చేయాలని గోపాల్ భార్గవ్ డిమాండ్ చేశారు. 

సింధియా వర్గంలోని ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ ఆమోదించిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 222కు పడిపోయింది. 112 మంది మద్దతు తెలిపితేనే కమల్‌నాథ్‌ గట్టెక్కుతారు. వారిలో 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ ఆమోదించనందున కాంగ్రెస్‌ బలం 108 మందిగా ఉన్నది. ఇప్పటికే బీజేపీకి 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యే ఇప్పటికే బీజేపీ మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను కలుసుకున్నారు. మరో నలుగురు స్వతంత్రుల మద్దతు ఎటువైపు అన్నది కీలకం.


logo